మహానటి: నా కెరీర్ లోనే అతిపెద్ద సినిమా

మహానటి సూపర్ హిట్ అయింది. యూనిట్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. టాలీవుడ్ ప్రముఖులు కొందరు యూనిట్ కు ప్రత్యేకంగా సన్మానాలు కూడా చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో మిస్సయిన కీలక నటుడు దుల్కర్ సల్మాన్. హిందీ, తమిళ సినిమాలతో బిజీ అయిపోయిన ఈ నటుడు.. ఎట్టకేలకు మహానటిపై రియాక్ట్ అయ్యాడు. తన కెరీర్ లోనే మహానటిని బిగ్గెస్ట్ మూవీగా చెప్పుకొచ్చాడు.

“ఇప్పటివరకు నా కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ ఇదే. పెద్ద బ్యానర్, భారీ సెట్స్, అదిరిపోయే కాస్ట్యూమ్స్.. ప్రతిది అద్భుతమే. ఇక స్పెయిన్ నుంచి వచ్చిన డానీ అనే కెమెరామెన్ అయితే అత్యంత అందంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు.”

మహానటి రిలీజ్ తర్వాత ఇలా ఫస్ట్ టైం తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు దుల్కర్. దర్శకుడు నాగ్ అశ్విన్ తనలో జెమినీ గణేశన్ ను చూడడమే తన అదృష్టమంటున్న దుల్కర్.. ఆ పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అయ్యాడో చెప్పుకొచ్చాడు.

“జెమినీ జీవితంలో బాధాకరమైన ఎపిసోడ్స్ అంటూ ఏవీ లేవు. ఆయన చాలా సంతోషకరమైన జీవితాన్ని అనుభవించాడు. ఈ పాత్ర కోసం నేను సావిత్రి పిల్లలతో మాట్లాడాను. జెమినీ గణేశన్ సినిమాలు చూశాను. జెమినీ మేనరిజమ్స్ గమనించడానికి సినిమాలు తప్ప మరే ఇతర వీడియోలు నాకు దొరకలేదు.”

తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవాలనే ఐడియా దర్శకుడిదే అంటున్నాడు దుల్కర్. తన పాత్రకు తెలుగు డబ్బింగ్ కోసం రోజుకు 8గంటలు చొప్పున 7రోజుల పాటు కష్టపడ్డానని తెలిపాడు. తెలుగు నేర్చుకోవడం చాలా థ్రిల్లింగ్ గా ఉందన్నాడు దుల్కర్.