మహేష్‌ ఓకే, మరి ప్రభాస్ ఏంటి దీపికా…?

ఒకప్పుడు సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్‌ లో నటించాలని కోరుకునే వారు. సౌత్ మార్కెట్‌ పరిధి తక్కువ ఉండటంతో పాటు, స్థానిక భాషలకే పరిమితం అవ్వడం వల్ల బాలీవుడ్‌ హీరోయిన్స్ ఇక్కడి సినిమాల పట్ల ఆసక్తి చూపించే వారు కాదు. కానీ గత పదేళ్ల కాలంగా బాలీవుడ్‌ హీరోయిన్స్ సౌత్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు.

బాలీవుడ్‌ కు చెందిన చాలా మంది హీరోయిన్స్ కి మన హీరోలు అంటే చాలా అభిమానం. ఆలియా భట్ నుంచి మొదలుకుని కృతి సనన్‌, శ్రద్ద కపూర్ వరకు చాలా మందికి టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ హీరోలు అభిమాన హీరోలు. ఆ విషయాలను పలు సందర్భాల్లో వారే వేరు వేరు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు.

తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకునే తనకు టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు అంటే ఇష్టం అంది. అంతే కాకుండా రానా అంటే కూడా తనకు ప్రత్యేకమైన అభిమానం అన్నట్లుగా చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు దీపికా వ్యాఖ్యలు ఒక వర్గం ప్రేక్షకుల్లో, నెటిజన్స్‌ లో అసంతృప్తి వ్యక్తం అయ్యేలా చేశాయి.

దీపికా ఆ వ్యాఖ్యలు చేసింది ‘కల్కి’ సినిమా ప్రమోషనల్‌ ఈవెంట్‌ లో అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రభాస్ సినిమా వేడుకలో మహేష్ బాబు నా అభిమాన హీరో, రానా అంటే నాకు ఇష్టం అంటూ చెప్పడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ దీపికా ను సోషల్‌ మీడియాలో కొందరు ప్రశ్నిస్తున్నారు.

మహేష్ బాబు అంటే అభిమానం ఉండటం లో తప్పులేదు. అయితే సమయం, సందర్భం ను చూసి ఆ విషయాన్ని చెప్పాలి. కానీ నువ్వు ప్రభాస్ ను అవమానించే విధంగా మహేష్ బాబు పేరు చెప్పావు అంటూ కొందరు ఈ విషయాన్ని పెద్దది చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

దీపికా పదుకొనే ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి గా ఉన్నారు. అయినా కూడా కల్కి సినిమా కోసం, ప్రభాస్ పై ఉన్న అభిమానంతో, తెలుగు సినిమా అయినా కూడా వెనక్కి తగ్గకుండా ప్రమోషన్ లో పాల్గొంటున్నారు. ఆ విషయాన్ని గుర్తించకుండా కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు కొందరు వ్యవహరిస్తున్నారు అంటూ కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.