దర్శకుడు పూరి జగన్నాధ్ తన ఆఫీస్ క్లోజ్ చేశాడు. స్టాఫ్ మొత్తాన్ని ఇంటికి పంపించేశాడు. తన డైరక్షన్ డిపార్ట్ మెంట్ కు హాలిడేస్ ఇచ్చేశాడు. ఇదంతా కరోనా ప్రభావం. అవును.. కరోనా వల్ల తన కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించాడు పూరి జగన్నాధ్. ఈ మేరకు పూరి-చార్మి పేరిట ఓ నోట్ రిలీజ్ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ వ్యవహరాలతో పాటు.. ప్రొడక్షన్ కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు
విజయ్ దేవరకొండ హీరోగా పాన్-ఇండియన్ మూవీ చేస్తున్నాడు పూరి జగన్నాధ్. మూవీకి సంబంధించి ముంబయిలో 40 రోజుల భారీ షెడ్యూల్ నిర్వహించారు. వచ్చే వారం నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభించాలనుకున్నారు. ఇంతలోనే కరోనా విజృంభించడంతో.. ఆ షెడ్యూల్ ఇప్పుడు నిరవధికంగా వాయిదా పడింది. కొత్త షెడ్యూల్ డేట్స్ ను త్వరలోనే వెల్లడించబోతున్నారు.
అటు నటుడు మోహన్ బాబు కూడా తన పుట్టినరోజు వేడుకల్ని వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించారు. మార్చి 19న జరగాల్సిన శ్రీవిద్యానికేతన్ వార్షికోత్సవాలతో పాటు.. తన పుట్టినరోజు వేడుకల్ని వాయిదా వేసుకుంటున్నట్టు తెలిపారు. మిత్రులు, బంధువులు ఎవరూ వార్షికోత్సవానికి, తన బర్త్ డే ఫంక్షన్ కు రావొద్దంటూ ప్రకటన విడుదల చేశారు.
కరోనా రాకుండా జాగ్రత్తలు చెబుతూ ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇప్పటికే ఒక వీడియో విడుదల చేయగా.. తాజాగా మహేష్ బాబు కూడా కరోనాపై స్పందించాడు. సామాజికంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, ప్రజారోగ్యం దృష్ట్యా సోషల్ లైఫ్ ను త్యాగం చేయాలని పిలుపునిచ్చాడు. ఇంట్లోనే ఉండాలని, శానిటైజర్లు వీలైనంత ఎక్కువగా వాడాలని కోరాడు. అందరం కలిసికట్టుగా కరోనాను జయించాలని పిలుపునిచ్చాడు.