మాజీ భార్య‌ల‌తో స్టార్ హీరో పార్టీలో సంథింగ్ మిస్సింగ్!

భార‌తదేశంలోని అతి పెద్ద స్టార్ అమీర్ ఖాన్ త‌న లైఫ్‌లో ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉన్నాడు. అత‌డు ఈ ఏడాదిలో త‌న కుమార్తె పెళ్లి చేసాడు. అంద‌మైన జంట కాపురం సంతోషంగా సాగుతోంది. ఈ ఆనంద స‌మ‌యాన త‌న త‌ల్లి బ‌ర్త్ డే వేడుక‌ల్ని మాజీ భార్య‌ల స‌మ‌క్షంలో, 200 మంది అతిథులు వివిధ న‌గ‌రాల నుంచి త‌ర‌లి రాగా వైభ‌వంగా జ‌రుపుకున్నాడు. కిరణ్ రావు, రీనా దత్తా, ఇరా ఖాన్‌తో కలిసి అమీర్ ఖాన్ త‌న‌ తల్లి జీనత్ గ్రాండ్ 90వ పుట్టినరోజు వేడుకల్ని జ‌రిపాడు. ముంబైలో పుట్టినరోజు పార్టీకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి.

అమీర్ ఖాన్ అమ్మి (తల్లి) జీనత్ హుస్సేన్ జూన్ 13 నాటికి 90 ఏళ్లు పూర్తి చేసుకుంది. అమీర్ కుమార్తె ఇరా ఖాన్, అతని మాజీ భార్యలు కిరణ్ రావు, రీనా దత్తా, ప్రముఖ నటి ఆశా పరేఖ్ స‌హా ఇతర సన్నిహితులు కుటుంబ సభ్యులు జీనత్ మైలురాయి పుట్టినరోజు వేడుక‌ల్లో పాల్గొన్నారు. జీనత్ పుట్టినరోజు పార్టీకి బెంగళూరు, లక్నో, మైసూర్ స‌హా ఇతర నగరాల నుండి అతిథులను ఆహ్వానించారు. పుట్టినరోజు పార్టీ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ ఫోటోల్లో తెల్లటి షేర్వానీ ధరించి ఉన్న అమీర్, తన తల్లికి బర్త్ డే కేక్‌ను కట్ చేయడంలో సహాయ ప‌డుతూ క‌నిపించాడు. ఆశా పరేఖ్, ఇరా ఖాన్ , కిరణ్ రావు, ఇతర అతిథులు వారి వెనుక నిలబడి అమ్మికి శుభాకాంక్ష‌లు చెబుతూ చప్పట్లు కొట్టారు. గ్రూప్ ఫోటోలో అమీర్ , కిరణ్ కుమారుడు ఆజాద్ రావ్ ఖాన్, అలాగే ఇరా భర్త నుపుర్ శిఖరే కూడా కనిపించారు.

పార్టీలో అమీర్‌తో జూహీ

అమీర్ ఖాన్ `ఖయామత్ సే ఖయామత్` తక్ సహనటి జూహీ చావ్లా కూడా ఈ బ‌ర్త్ డే వేడుక‌ల‌కు హాజరయ్యారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో జూహీ తాను అమీర్ తో ఉన్న ఒక ఫోటోని షేర్ చేసారు. అమ్మిస్ ప్రత్యేక పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది! అని రాసారు. జూహీ-అమీర్ జంట‌ ఇష్క్, అందాజ్ అప్నా అప్నా, హమ్ హై రహీ ప్యార్ కే లాంటి చిత్రాలలో కూడా జంట‌గా న‌టించారు. జీనత్ హుస్సేన్ 90వ పుట్టినరోజు సందర్భంగా అమీర్ వివిధ నగరాల నుండి ముంబైకి 200 మంది అతిథులను ఆహ్వానించార‌ని జాతీయ మీడియా వెల్ల‌డించింది.

అమీర్‌కి సన్నిహితంగా ఉన్న ఒక సోర్స్ ప్ర‌కారం..అమీర్ ఖాన్ తన తల్లి పుట్టినరోజు వేడుక‌ల కోసం వివిధ నగరాల నుండి 200 పైగా కుటుంబ సభ్యులు స్నేహితులకు ఆహ్వానించారు. ఏడాది కాలంగా ఆమె అనారోగ్యంతో ఉన్నారు. ఇప్పుడు ఆమె కోలుకుని బాగానే ఉండడంతో అందరూ పెద్దగా గెట్ టు గెదర్ చేయాలని అనుకున్నారు. ఈ ప్రత్యేకమైన రోజును సెల‌బ్రేట్ చేయ‌డానికి భారతదేశం నలుమూలల నుండి కుటుంబ సభ్యులు, స్నేహితులు తరలివచ్చారు.. అని తెలిపారు.

పార్టీలో ఏదో మిస్స‌యింది:

అయితే ఈ పార్టీలో అంతా బాగానే ఉంది కానీ ఏదో సంథింగ్ మిస్స‌యింది! అంటూ నెటిజ‌నులు కామెంట్లు చేస్తున్నారు. అమీర్ ఖాన్ అన‌ధిక మూడో భార్య, న‌టి స‌నా ఖాన్ గురించి ప‌లువురు నెటిజ‌నులు కామెంట్ చేసారు. దంగ‌ల్ బ్యూటీ స‌నాఖాన్ తో అమీర్ ఖాన్ సాన్నిహిత్యం గురించి చాలా కాలంగా పుకార్లు ఉన్నా కానీ, దానిని ఆ ఇద్ద‌రూ అధికారికం చేయ‌ని సంగ‌తి తెలిసిందే. అయితే స‌నాఖాన్ అమీర్ త‌ల్లి బ‌ర్త్ డే వేడుక‌ల్లో క‌నిపించ‌క‌పోవ‌డంతో అభిమానులు విస్మ‌యం వ్య‌క్తం చేసారు.