మాజీ మంత్రి సోమిరెడ్డిపై కేసు: ప్యాకింగ్ సొమ్ములెవడిస్తాడు.?

ఆనందయ్య నాటు మందు విషయమై జరుగుతున్న ‘రాజకీయ రాద్ధాంతం’లో కొత్త ట్విస్ట్. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద కేసు నమోదైంది. తమ డేటా చోరీ చేశారంటూ శేశ్రిత టెక్నాలజీ సంస్థ ఎండీ నర్మదా రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆనందయ్య నాటు మందుని ఆన్‌లైన్ ద్వారా పంపిణీ చేసేందుకోసం శేశ్రిత టెక్నాలజీ ఓ అప్లికేషన్ రూపొందిస్తున్న విషయం విదితమే. ప్రభుత్వం నుంచి అందుకు తగ్గ ఆదేశాలేవీ శేశ్రిత సంస్థకు రాలేదు. కానీ, సామాజిక బాధ్యత నేపథ్యంలో ఈ పని తాము చేస్తున్నామన్నది నర్మదా రెడ్డి వాదన.

అయితే, శేశ్రిత సంస్థతో వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధాలున్నాయనీ, 100 కోట్లకు పైగా కుంభకోణం ఇందులో దాగి వుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించడమే కాదు, ఇందుకు తగ్గ ఆధారాలంటూ కొన్ని వివరాల్ని మీడియా సమావేశంలో నిన్ననే విడుదల చేశారు.

ఆనందయ్య నాటు మందు ఉచితంగానే పంపిణీ చేయనున్న విషయం విదితమే. మందు ఉచితమే అయినా, ప్యాకింగ్ సహా ఆన్‌లైన్ డెలివరీ ఖర్చులుంటాయన్నది నర్మదారెడ్డి వాదన. ఇదెక్కడి చోద్యం.? ఆనందయ్య మందు విషయమై ప్రభుత్వ పెద్దలు అత్యుత్సాహం చూపుతున్న మాట వాస్తవం. అలాంటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే ఈ నాటు మందుని ఉచితంగా చేయాలి కదా.?

ఓ సంస్థ ఓ అప్లికేషన్ రూపొందించేసి, దాని ద్వారా నిర్ణీత మొత్తాన్ని వసూలు చేసి, ఆనందయ్య నాటు మందుని అవసరమైనవారికి డెలివరీ చేస్తామంటే అదెలా కుదురుతుంది.? పైగా, తమ అప్లికేషన్ వివరాల్ని ఎమ్మెల్యేకి చూపించామనీ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కి కూడా తెలియజేశామని నర్మదారెడ్డి చెబుతున్నారు.

సరే, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారా.? లేదా.? అన్నది వేరే చర్చ. ఉచితంగా ఇవ్వాల్సిన మందుకి ప్యాకింగ్ ఛార్జీలనో, మరొకటనో పేరు చెప్పి వసూళ్ళకు పాల్పడాలన్న ఆలోచన కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఆనందయ్య నాటు మందు చుట్టూ విపరీతమైన పబ్లిసిటీ జరిగాక, దీనికోసం ఆన్‌లైన్ ధర ఎంత పెట్టినా.. అది కాసుల కనక వర్షం కురిపించడం ఖాయం.

అయినా, ఉచిత మందు విషయంలో ఇంత రాజకీయ వివాదం అవసరమా.? అసలు ఆ మందు కరోనాపై పనిచేస్తుందో లేదో తెలియదు.. అయినా, ఇంత రాజకీయ రగడ.. అంటే తెరవెనుకాల ఏదేదో జరిగిపోతోందని అనుమానించకుండా ఎలా వుండగలం.?