మార్చిలో ‘ఆర్ఆర్ఆర్’ టీం ఇచ్చే అప్‌డేట్ ఏంటి?


‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో ఆశలు, అంచనాలు రేకెత్తిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబలి’ క్రేజ్‌ను, బిజినెస్‌ను, కలెక్షన్లను రిపీట్ చేయడం మరో సినిమాకు సమీప భవిష్యత్తులో సాధ్యం కాదనే అనుకున్నారు కానీ.. అసామాన్యుడైన రాజమౌళి ఈ సవాల్‌ను తేలిగ్గానే ఛేదించేసేలా ఉన్నాడు.

వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. ఇప్పుడే ఫ్యాన్సీ రేట్లతో సినిమాను కొనేస్తున్నారు. ‘బాహుబలి-2’ బిజినెస్ రికార్డుల్ని ఇది బద్దలు కొట్టడం లాంఛనం లాగే అనిపిస్తోంది. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే వసూళ్ల రికార్డుల్ని కూడా అందుకున్నా అందుకోవచ్చు. ఏం జరుగుతుందో చూడాలి. ఇదిలా ఉంటే.. సినిమా మొదలై ఏడాది దాటుతున్నా.. ఇప్పటిదాకా ఏ విశేషాన్నీ పంచుకోకపోవడం అభిమానుల్ని నిరాశ పరుస్తోంది.

ఒకరికిద్దరు హీరోలున్నారు వాళ్ల ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేయలేదు. సినిమాకు పేరు పెట్టలేదు. ఇంకే రకమైన అప్ డేట్ కూడా లేదు. పండుగలో పబ్బాలో టీం తరఫున విషెస్ చెప్పడం తప్ప ‘ఆర్ఆర్ఆర్’ టీం నుంచి అసలు అప్ డేటే ఉండట్లేదు. ఈ విషయంలో నెటిజన్లు తమ అసహనాన్ని దాచుకోవట్లేదు. ‘ఆర్ఆర్ఆర్’ టీం అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేసి అమ అసంతృప్తిని చెప్పేస్తున్నారు. తాజాగా ఒక అభిమాని అప్ డేట్ ఎప్పుడూ అంటూ ఈ హ్యాండిల్ నిర్వాహకుల్ని ప్రశ్నించాడు.

దానికి సమాధానంగా మార్చిలో అంటూ సమాధానం రావడం విశేషం. అఫీషియల్ హ్యాండిల్లో ఇలా బదులిచ్చారంటే.. కచ్చితంగా మార్చిలో అప్ డేట్ ఇవ్వబోతున్నట్లే. కాబట్టి కౌంట్ డౌన్ మొదలైనట్లే. మరి ఈ టీం ఇచ్చి అప్ డేట్ ఏంటి అన్నది ఆసక్తికరం. బహుశా సినిమా టైటిల్ రివీల్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు రాబోతున్న నేపథ్యంలో అతడి ఫస్ట్ లుక్ లాంచ్ చేసినా ఆశ్చర్యం లేదేమో. ఇప్పుడు చరణ్ లుక్ వదిలి.. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజుకు అతడి ఫస్ట్ లుక్ వదులుతారేమో చూడాలి.