మాస్ హీరోకు విలన్ గా గోపిచంద్.. సెట్టయితే అరాచకమే..

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్.. కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్న ఆయన.. ఇప్పుడు విశ్వం మూవీతో బిజీగా ఉన్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆ సినిమాను స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్నారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకురానున్నారు. విశ్వం మూవీతో ఎలా అయినా హిట్ కొట్టాలని చూస్తున్నారు గోపీచంద్.

రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్.. సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఫుల్ కామెడీ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మూవీ ఉండబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. శ్రీను వైట్ల కామెడీ మార్క్ క్లియర్ గా కనిపించింది. గోపీచంద్ తన యాక్షన్ తో అదరగొట్టారు. ఈ మూవీతో గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని డైరెక్టర్, హీరో ఇద్దరూ చూస్తున్నారు. అయితే గోపీచంద్ లో విలన్ గా నటించే సత్తా కూడా ఉన్న విషయం తెలిసిందే.

వర్షం, జయం చిత్రాల్లో విలన్ గా తన టాలెంట్ ఏంటో చూపించారు గోపీచంద్. మహేష్ బాబు నిజం మూవీలో అయితే వేరే లెవెల్ లో అలరించారు. ఆయన రోల్ అండ్ యాక్షన్ ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. యజ్ఞం చిత్రం మంచి హిట్ అవ్వడంతో హీరోగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు బాలకృష్ణ అప్ కమింగ్ మూవీకి గాను గోపీచంద్ కు విలన్ రోల్ ను మేకర్స్ ఆఫర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం NBK109ను కంప్లీట్ చేస్తున్న బాలయ్య.. నెక్స్ట్ మాస్ డైరెక్టర్ బోయపాటి శీనుతో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగా, త్వరలో షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది. అఖండ2నే ఆ సినిమా అని ప్రచారం జరుగుతుండగా, ఆ విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు గోపీచంద్ ను విలన్ గా నటించమని మేకర్స్ అడగనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే గోపీచంద్ కు స్టోరీ నెరేట్ చేయనున్నారని వినికిడి.

ఆ విషయం బాగానే ఉన్నా.. గోపీచంద్ అందుకు ఒప్పుకుంటారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లెజెండ్ లో బాలయ్యను ఢీకొట్టే జగపతి బాబు క్యారెక్టర్ ను బోయపాటి అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు బాలకృష్ణతో కొత్త మూవీ కోసం కూడా వేరే లెవెల్ లో విలన్ రోల్ ను ఆయన డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మరి గోపీచంద్ బాలయ్యకు సవాల్ విసిరే రోల్ చేసేందుకు అంగీకరిస్తారో లేదో చూడాలి.