డా. రాజశేఖర్ జీవితల ఇద్దరు కూతుళ్లు శివానీ శివాత్మిక వారి వారసులుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. ఈ ఇద్దరిలో శివాత్మిక ‘దొరసాని’ సినిమాతో పరిచయం కాగా శివానీ ‘అద్భుతం’ సినిమాతో తెరంగేట్రం చేసింది. రీసెంట్ గా రాజ్ తరుణ్ తో కలిసి ‘అహనా పెళ్లంట’లోనూ నటించింది. ప్రస్తుతం ‘విద్యా వాసుల అహం’లో నటిస్తోంది. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఇదిలా వుంటే శివాత్మిక నటించిన అంథాలజీ ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 9న విడుదలైంది.
ఈ మూవీ రిలీజ్ సందర్భంగా జీవితా రాజశేఖర్ తమ ఇద్దరు కూతుళ్ల గురించి పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. చిన్ననాటి నుంచి మా అమ్మాయిలు శివానీ శివాత్మిక సినిమాల్లోనే పెరిగారు.
ఆ ప్రభావంతోనే పెద్దయ్యాక వాళ్లు మేం కూడా సినిమాల్లో నటిస్తామని చెప్పగానే నేను రాజశేఖర్ టెన్షన్ పడ్డాం. ఎందుకంటే సినిమాల్లో రాణించడం అంత సులభం కాదు. చిన్నప్పటి నుంచి వాళ్లకు ఏది కావాలన్నా అది ఆస్తులమ్మేసైనా చేశాం. కానీ సినిమాల్లో నటించడం పేరు తెచ్చుకోవడం మంచి క్యారెక్టర్స్ రావడం అనేది విధి.
దీన్ని ఎక్కడా కొనలేం. అందువల్ల నేను రాజశేఖర్ మా అమ్మాయిల విషయంలో చాలానే టెన్షన్ పడ్డాం. మీరు నటించడంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకు మా వంతు సపోర్ట్ చేస్తాం. అయితే మీరు సినిమాల్లో రాణించొచ్చు.. రాణించకపోవచ్చు. కాబట్టి మీరు బాధపడకూడదని మాత్రమే వారికి సలహా ఇచ్చాం.
‘పంచతంత్రం’ సినిమాని దర్శకుడు చాలా సహజంగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. ఇందులో అన్ని కథల్లో మన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫేస్ చేసే సమస్యలు కష్టం వచ్చినప్పుడు మనం ఎలా ముందుకు వెళ్లాలనే విషయాలను చాలా చక్కగా ఆవిష్కరించారు. కష్టాల్లో ముందుకెళ్తే ఏదో ఒకరోజు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాం.
అదే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. సినిమా డైరెక్టర్ హర్ష చిన్న వయసులోనే జీవితాన్ని చాలా స్టడీ చేసి తెరకెక్కించినట్టుగా అనిపించింది. తను ఏం చెప్పాలనుకున్నాడో దాన్ని చక్కగా తెరపై ఆవిష్కరించాడు’ అని తెలిపారు. శివానీ తెలుగులో ఐదు.. తమిళంలో రెండు సినిమాల్లో నటించింది. ఇక శివాత్మిక తెలుగులో మూడు తమిళంలో రెండు సినిమాల్లో నటించింది. కృష్ణవంశీ రూపొందిస్తున్న ‘రంగమార్తాండ’లో శివాత్మక నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.