‘మా’ రాజకీయం.. చిరంజీవికి ఏంటి సంబంధం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా).. గట్టిగా వెయ్యి మంది ఓటర్లు కూడా లేని అసోసియేషన్ ఇది. ఈ విషయాన్ని ‘మా’ ప్రముఖులే చెబుతుంటారు. చాలామంది సినీ ప్రముఖులు అసలు ఓటే వెయ్యరు ‘మా’ ఎన్నికల్లో. ఎప్పుడో.. చాన్నాళ్ళ క్రితం చిరంజీవి చొరవ చూపడంతో ‘మా’ ఏర్పాటయ్యింది. ఆ తర్వాత క్రమంగా సినీ పరిశ్రమలోని రాజకీయాలు ‘మా’ ప్రతిష్టను మసకబారేలా చేశాయి.

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. ఎగేసుకుని రాజకీయాలు చేసేస్తుంటారు కొందరు. నిస్సిగ్గుగా మీడియాకెక్కి తిట్టుకోవడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. ఇంతా చేసి అదేమన్నా గొప్ప పదవా.? అంటే అదీ లేదు. ‘మా’ అధ్యక్షుడిగా ఎవరున్నా, వారికి సినీ పరిశ్రమలో తగిన గౌరవం దక్కదు సరికదా.. వున్న గౌరవం కోల్పోవాల్సి వస్తుందన్న విమర్శ ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తోంది.

ఇంకోసారి ‘మా’ ఎన్నికలు షురూ అయ్యాయి. ప్రకాష్ రాజ్.. ఈసారి పోటీ పడుతున్నారు ‘మా’ అధక్ష పదవి కోసం. ఇంకో వైపు మంచు విష్ణు కూడా బరిలో వుంటాడనే ప్రచారం జరుగుతోంది. మరికొందరి పేర్లూ వినిపించినా అదెంత నిజమో తెలియదు. చిరంజీవి ఆశీస్సులు ప్రకాష్ రాజ్ పొందాడన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన. అది నిజమే కావొచ్చు.

నిజానికి చిరంజీవి తనను ఎవరు కలిసినా ఆశీర్వదిస్తారు.. అది ఆయన పెద్ద మనసుకి నిదర్శనం. పరిశ్రమలో ఏదన్నా సమస్య వస్తే.. ‘పెద్దన్న’గా చిరంజీవే వాటిని పరిష్కరించాల్సి వస్తోంది ఇటీవలి కాలంలో. ఆయన కోరుకున్న పదవి కాదు ‘పెద్దన్న’ పదవి. దాన్ని ఆయనకు కట్టబెట్టారు సినీ ప్రముఖులు చాలామంది.

కానీ, ఇక్కడ.. ఈసారి ‘మా’ ఎన్నికల విషయంలోనూ చిరంజీవిని కార్నర్ చేస్తున్నారు కొందరు. తెలుగు మీడియా కులాల వారీగా, రాజకీయ పార్టీల వారీగా విడిపోయిందన్న విమర్శ ఈనాటిది కాదు. అందులో కొన్ని ఛానళ్ళు, పత్రికలు.. సహజంగానే చిరంజీవిని టార్గెట్ చేస్తాయి.. చేస్తున్నాయి కూడా. ‘చిరంజీవిని వీటిల్లోకి లాగొద్దు..’ అని ప్రకాష్ రాజ్ స్వయంగా చెప్పినా, చెత్త విశ్లేషణలు ఆగడంలేదు.

‘మాది చాలా చిన్న అసోసియేషన్.. ఎన్నికలు జరుపుకుంటాం.. అయినా అందరం కలిసే వుంటాం..’ అని నిర్మాత, నటుడు బండ్ల గణేష్ చెప్పింది వాస్తవం. కానీ, మీడియాకి ‘స్పైసీ’ న్యూస్ కావాలి. న్యూస్ అయితే ఫర్లేదు.. ఆ పేరుతో చెత్త మసాలా వంటకాలు వండేస్తుండడమే అసలు సమస్య.కొసమెరుపేంటంటే ‘మా’ మీద పట్టు కోసం చిరంజీవి ప్రయత్నిస్తున్నారనీ, అది ఆయనకు సాధ్యం కాకపోవచ్చనీ కొన్ని వంటకాలు (కథనాలు, విశ్లేషణలు) వెకిలి ప్రచారానికి దిగడం.