మెగాస్టార్- గ్లోబ‌ల్ స్టార్ ఒకే పంథాలో!

మెగాస్టార్ చిరంజీవి-గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మూవీ లైన‌ప్ ఒకేలా ఉందా? ఇద్దరు ఒకే పంథాలో జ‌ర్నీ క‌నిపిస్తుందా? అంటే అవున‌నే తెలుస్తోంది. ప్ర‌స్తుతం చిరంజీవి హీరోగా సోషియా ఫాంట‌సీ ‘విశ్వంభ‌ర’ చిత్రాన్ని వ‌షిష్ట తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌కుడిగా వ‌షిష్ట‌కి రెండ‌వ చిత్ర‌మిది. అత‌డు తెర‌కెక్కించిన తొలి సినిమా ‘బింబిసార’ మంచి విజ‌యం సాధించ‌డంతో అదే న‌మ్మ‌కంతో చిరంజీవి పిలిచి మ‌రీ అవ‌కాశం ఇచ్చారు. అలాగే ఆర్సీ 16 కూడా ఇలా పట్టాలెక్కిన చిత్ర‌మిదే. ఈ చిత్రానికి బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ద‌ర్శ‌కుడిగా అత‌ని తొలి సినిమా ‘ఉప్పెన‌’. తొలి సినిమాతోనే బుచ్చిబాబు వంద కొట్ల క్ల‌బ్ లో చేరాడు. ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ బుచ్చికి రెండ‌వ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఇలా తండ్రీ త‌న‌యులిద్ద‌రు ఒక సినిమాతో హిట్ కొట్టిన ద‌ర్శ‌కుల‌కు ఒకేసారి అవ‌కాశం ఇవ్వ‌డం స్టార్ హీరోల కోటాలో ఇంత‌వ‌ర‌కూ చోటు చేసుకోలేదు. పైగా ఈ రెండు సినిమాలు ఒకే ఏడాది రిలీజ్ అవుతున్నాయి. సంక్రాంతి కానుక‌గా ‘విశ్వంభ‌ర’ రిలీజ్ అవుతుంటే..అదే ఏడాది వేస‌విలో ఆర్సీ 16 రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంది. ఇక తండ్రీ త‌న‌యుల స్టార్ డ‌మ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఒక్కో హీరో సోలోగా సునాయాసంగా ఒక్కొక్క‌రు 500 కోట్లు వ‌సూళ్లు తేగ‌ల సామ‌ర్ద్యం ఉన్నవారు. ‘సైరా న‌ర‌సింహారెడ్డి’తో మెగాస్టార్ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ సినిమా ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. కానీ మెగాస్టార్ ఇమేజ్ కి స‌రైన కంటెంట్ ప‌డితే! కోట్ల వ‌సూళ్లు పెద్ద విష‌యం కాదు. ఇక చ‌ర‌ణ్ ‘ఆర్ ఆర్ ఆర్ ‘ సినిమాతో పాన్ ఇండియాలో లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ‘గేమ్ ఛేంజ‌ర్’ చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.

‘ఒకే ఒక్క‌డు’ రేంజ్ లో సినిమా ఉంటుంద‌నే ప్ర‌చారం సాగుతోంది. అదే జ‌రిగితే! చ‌ర‌ణ్ ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌డం ఖాయం. బుచ్చిబాబు సినిమా కూడా పాన్ ఇండియాలోనే రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి ఏ.ఆర్ రెహ‌మాన్ సంగీతం అందించ‌డం సినిమాకి అద‌న‌పు అస్సెట్ గా క‌లిసొస్తుంది. ఇక విశ్వంభ‌ర చిత్రానికి పాన్ ఇండియాలో సంచ‌ల‌న‌మైన కీర‌వాణి సంగీతం అందించ‌డం అంతే హైలైట్ అవుతుంది. అలా త‌న‌యుడి సినిమాతో రెహ‌మాన్..తండ్రి సినిమాతో కీర‌వాణి మ్యూజిక‌ల్ గా మార్కెట్ లో పోటీ ప‌డ‌టం ఇదే తొలిసారి.