మోడీ : గురివింద నీతి డైలాగులు!

తనకు ప్రధాని పదవికి పోటీదారు కాగల, లేదా- పోటీదారుగా ప్రచారంలో ఉన్న,. రాహుల్ గురించి కాసిని సెటైర్లు వేయడానికి నరేంద్ర మోడీకి మరో అవకాశం అంది వచ్చింది. త్వరలోనే రాహుల్ కు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పట్టాభిషేకం జరుగుతుందని అందరూ అనుకుంటున్న తరుణంలో.. ఆయన ఈ సెటైర్లతో తన ప్రత్యర్థి గురించి చులకన అభిప్రాయం ప్రజల్లో కలిగించడానికి తన వంతు ప్రయత్నం తాను చేస్తున్నారు.

పైగా గుజరాత్ ఎన్నికల నగారా మోగిన తర్వాత.. రాహుల్ ను మరింతగా విమర్శిస్తే తప్ప.. విజయం దరి చేరదనే ఆశ కూడా ఆయనకు ఉండొచ్చు. కాకపోతే.. మోడీ చేస్తున్న విమర్శలు అచ్చంగా.. గురివింద నీతిని తలపిస్తున్నాయని పలువురు భావిస్తున్నారు. తన పార్టీలో తాను ఎలాంటి పోకడలకు శ్రీకారం చుట్టాడో, ఎలాంటివి ఆరంభించాడో ఓసారి వెనుదిరిగి చూసుకోకుండా కాంగ్రెస్ ను మాత్రం విమర్శించడం పాడి కాదని ప్రజలు అంటున్నారు.

ఇంతకూ మోడీ విమర్శలేంటంటే.. రాజకీయాల్లో అంతర్గత ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతోందిట. పార్టీలకు అసలు ప్రజాస్వామ్యం అంటేనే నమ్మకం లేకుండా, విలువ లేకుండా పోతున్నదని.. అందుకే కొన్ని పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోవడం లేదని ఆయన విమర్శ. నిజానికి అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఏ పార్టీలో ఉంది? భాజపా ఏమైనా మినహాయింపు ఉన్న పార్టీనా అనేది ప్రజల విమర్శ.

ఒకప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న విలువలు, ఆచరించిన సిద్దాంతాలు వేరు. కనుకనే వెంకయ్యనాయుడు కూడా అధ్యక్షుడు కాగలిగారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ కూడా స్వామిపూజ, భజన రాజకీయాలు నడపడంలో కాంగ్రెస్ పార్టీని మించిపోతున్నది. ప్రత్యేకించి తాను ప్రధాని అయిన తర్వాత.. కేబినెట్ అందరూ తనను భజన చేసే సంస్కృతిని నరేంద్రమోడీనే ప్రారంభించారని చెప్పాలి.

ఆ రకంగా తన మోనోపలీకి రంగం సిద్ధం చేసుకుని.. పార్టీలో అప్పటిదాకా ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యాన్ని నిర్దాక్షిణ్యంగా తొక్కేసింది కూడా ఆయనే అనే విమర్శలు ఉన్నాయి. అమిత్ షాను మళ్లీ అధ్యక్షుడు చేయడంలో మోడీనే యావత్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కారు. తన వెనుక ఉన్న ఇలాంటి మచ్చలన్నీ మర్చిపోయి.. రాహుల్ కు పట్టాభిషేకం జరగడాన్ని మోడీ తప్పుబట్టడం సరికాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.