టి- సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ గురించి తెలియనివారు లేరు. ఆయన మ్యూజిక్ ఇండస్ట్రీ లెజెండ్. టి సిరీస్ బ్రాండ్ సృష్టి కర్త. దశాబ్ధాల పాటు పరిశ్రమను ఏల్తున్న లెగసీకి పునాది వేసింది అతడు. ఇప్పుడు ఆయన వారసత్వం హిందీ చిత్రసీమను ఏల్తోంది. కేవలం టి సిరీస్ మ్యూజిక్ లేబుల్ మాత్రమే కాదు, పరిశ్రమలో పేరున్న నిర్మాతగా గుల్షన్ కుమార్ వారసుడు భూషణ్ కుమార్ సత్తా చాటుతున్నారు. తండ్రి లెగసీని వారసుడిగా శిఖరం ఎత్తుకు చేర్చారు. టిసిరీస్ బ్రాండ్ అంతకంతకు ఎదగడానికి తనవంతు కృషి చేస్తున్నారు.
అయితే గుల్షన్ జీ బయోపిక్ చాలా కాలం క్రితమే ప్రకటించినా ఇప్పటికీ తెరకెక్కకపోవడానికి అసలు కారణం ఏమిటీ? ఈ ప్రశ్నకు సమాధానం ఇంతకాలం లేదు. కానీ ఇప్పుడు దానికి భూషణ్ కుమార్ ఒక స్పష్ఠత నిచ్చారు. అమీర్ ఖాన్ కథానాయకుడిగా ప్రతిష్ఠాత్మక బయోపిక్ కోసం సర్వం సిద్ధమైంది. కానీ ఈ సినిమాని ఆపేయడానికి కారణం .. నాన్న గారి చరిత్రపై స్క్రిప్టును ఇంకా మా అమ్మ గారు ఓకే చేయలేదు. మేం ఒక కోణంలో ఈ సినిమాని తీయాలని అనుకున్నాం. కానీ అమ్మ వేరొక కోణంలో నాన్న కథను విశ్లేషించాలని అనుకున్నారు. అందుకే ఇప్పుడు స్క్రిప్టును రీరైట్ చేస్తున్నాం. వాయిదాకు అసలు కారణమిదేనని భూషణ్ జీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
మా అమ్మను ఒప్పించకపోతే నేను మా నాన్నపై సినిమా తీయలేను అని భూషణ్ కుమార్ వెల్లడించారు. గుల్షన్ కుమార్ బయోపిక్ ప్రారంభ స్క్రిప్ట్‌పై తన తల్లి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆపేసామని, తన తండ్రి జీవితంలో బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో సంఘటనలతో నిండిన ఒక స్ఫూర్తిదాయకమైన కథను తెరపై చూపిస్తామని అన్నారు. అమీర్ ఖాన్ ఈ సినిమాలో నటించేందుకు సిద్ధంగా ఉన్నారు. అతడు ఎప్పుడూ నాకు చెబుతుంటారు. ఇది ఇటీవలి కాలంలో నేను చదివిన ఉత్తమ స్క్రిప్ట్ అని.. కానీ కుటుంబం నుండి స్క్రిప్టుపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి.. ముఖ్యంగా మా అమ్మ ఈ కథను ఒక కోణం నుండి చెప్పాలనుకుంది.
మేము మరొక కోణం నుండి స్క్రిప్ట్ రాశాము అని తెలిపారు. ప్రస్తుతానికి స్క్రిప్ట్‌ను రీవర్క్ చేస్తున్నామని కూడా వెల్లడించారు. అలాగే ఈ చిత్రంలో అవాస్తవాలను చూపించే ఉద్ధేశం లేదని, ఉన్నది ఉన్నట్టుగానే చెబుతామని కూడా భూషణ్ జీ వ్యాఖ్యానించారు. 1983లో భూషణ్ కుమార్ తండ్రి గుల్షన్ కుమార్ టి -సిరీస్‌ని స్థాపించారు. 1990ల నుంచి సినీనిర్మాణ సంస్థగాను విస్తరించింది. అయితే 46 ఏళ్ల వయసులో గుల్షన్ కుమార్ ను 1997లో ముంబైలో కాల్చి చంపారు. 2002లో గుల్షన్ కుమార్ హత్య కేసులో అబ్దుల్ రవూఫ్ దోషి అని తేలింది.
నిజానికి బయోపిక్‌ల యుగంలో గుల్షన్ కుమార్ స్టోరి నిజంగా ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన నిండైన సరుకును కలిగి ఉంది. అతడికి శత్రువులున్నారని, కుట్రలు జరిగాయని దీనికి కారణం మ్యూజిక్ ఇండస్ట్రీ రైవల్రీ అని కూడా కథనాలొచ్చాయి. 12 ఆగస్ట్ 1997న టి-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ ముంబైలోని జుహు ప్రాంతంలోని జీత్ నగర్‌లోని ఒక ఆలయం వెలుపల కాల్చి చంపబడ్డాడు.
మొత్తం ముగ్గురు దుండగులు అతడిని 16 సార్లు కాల్చిచంపడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ కేసులో రవూఫ్ ని కుట్రదారుగా ధృవీకరించి అరెస్ట్ చేసారు. సంగీత స్వరకర్త నదీమ్ అక్తర్ ఈ నేరానికి సహ కుట్రదారుగా ప్రకటించారు. అతడు హంతకులను నియమించారని కథనాలొచ్చాయి. నదీమ్ UKలో నివసించేవాడు. అయితే అతడు నిర్దోషిగా విడుదలయ్యాడు.
నిర్మాత, టిప్స్ యజమాని, రమేష్ తౌరాని ఈ హత్యా నేరాన్ని ప్రోత్సహించారని భావించిన పోలీసులు అక్టోబర్ 1997లో అరెస్టు చేసారు. టి-సిరీస్ ప్రాథమిక ప్రత్యర్థులలో టిప్స్ ఒకటి. అయితే నేరంతో అతని లింక్ కోర్టు విచారణలో నిరూపణ కాకపోవడంతో తౌరానీని విడుదల చేశారు. గుల్షన్ హత్యానంతరం ఒక నెల తరువాత నవంబర్ 1997లో మరో 26 మంది నిందితులుగా ఉన్నారు. వారిలో 15 మందిపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మరిన్ని అరెస్టులు జరిగాయి.