యాత్ర 2లో ఆ ఇద్దరి పాత్రలు లేవట

మహి వి రాఘవ దర్శకత్వంలో వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కిన మూవీ యాత్ర2. ఈ మూవీ ఫిబ్రవరి 8న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి. ఎమోషనల్ పొలిటికల్ జర్నీగా ఈ చిత్రాన్ని మహి వి రాఘవ ఆవిష్కరించారు. తండ్రి ఆశయం కోసం ఎంత వరకైనా వెళ్లే కొడుకుగా, ప్రజా నాయకుడిగా జగన్ ని ఈ చిత్రంలో దర్శకుడు చూపిస్తున్నారు.

టైటిల్ రోల్ ని తమిళ్ యాక్టర్ జీవా పోషించారు. వైఎస్ ఆర్ పాత్రలో మమ్ముట్టి కనిపిస్తున్నారు. ఇక ఈ మూవీ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోన్న కారణంగా కచ్చితంగా జగన్ కి విలన్స్ అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సోనియాగాంధీ పాత్రలు ఉంటాయని అందరూ భావిస్తారు. పవన్ కళ్యాణ్ 2014కి ముందు రాజకీయాలలోకి వచ్చారు కాబట్టి అతని ప్రస్తావన ఉండొచ్చని అందరూ అనుకుంటున్నారు.

అలాగే జగన్ కి అండగా వైఎస్ షర్మిల ఓదార్పుయాత్ర చేశారు కాబట్టి ఆమె పాత్ర కూడా ఉండొచ్చని అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిల పాత్రలు యాత్ర 2లో లేవంట. యాత్ర 2 కాన్సెప్ట్ కేవలం జగన్ రాజకీయ ప్రయాణం, అక్రమ ఆస్తుల కేసులో జైలుకి వెళ్లడం లాంటి ఎలిమెంట్స్ తోనే ఉండబోతోందని తెలుస్తోంది.

అందుకే సోనియాగాంధీ, చంద్రబాబు పాత్రలని సినిమాలో పెట్టారు. అవి కూడా చాలా లిమిటెడ్ గా ఉంటాయంట. ముఖ్యంగా సినిమాలో ఎవ్వరినీ విలన్ గా చూపించే ప్రయత్నం చేయడం లేదని టాక్. జగన్ ఎమోషనల్ జర్నీని మాత్రమే తెరపై ఆవిష్కరించినట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పటి వరకు అయితే యాత్ర 2 మీద పాజిటివ్ ఒపీనియన్ ఆడియన్స్ కి ఉంది. మరి థియేటర్స్ లోకి వచ్చాక మూవీ ఏ మేరకు ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందనేది చూడాలి.

యాత్ర సినిమాని 2019 ఎన్నికలకి ముందు మహి వి రాఘవ రిలీజ్ చేశారు. ఆ మూవీ మంచి హిట్ టాక్ సొంతం చేసుకొని జగన్ రాజకీయప్రయాణానికి కొంత ఊతం ఇచ్చింది. ఇప్పుడు 2024 ఎన్నికలకి ముందు వస్తోన్న యాత్ర2 ఏ మేరకు జగన్ కి రాజకీయంగా ఉపయోగపడుతుందో చూడాలి.