రజనీకాంత్ ని అలా చూసి షాక్ అయినా అరవింద స్వామి!

తమిళ్ సినీ ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా నేటికీ కూడా తన సత్తా చాటుతున్న నటుడు రజనీకాంత్.. సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రజనీకాంత్ కెరీర్ తొలిదశలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కున్నారు. సినీ ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న స్టార్‌డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంత పాపులారిటీ ఉన్న హీరో అయినప్పటికీ రజినీకాంత్ చాలా సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతారు.

దేశంలోనే అత్యధిక పారితోషకం తీసుకునే నటుడిగా పేరు తెచ్చుకున్న రజినీకాంత్.. నిజజీవితంలో దర్జాలకు, విలాసాలకు దూరంగా ఉంటారు. ఈ వయసులో కూడా కుర హీరోలకు దీటుగా వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో రజనీకాంత్ దూసుకుపోతున్నారు. నిజజీవితంలో ఎంతో సదా సిదాగా కనిపించే రజినీకాంత్ గురించి అభిమానులకు అందరికీ తెలుసు.. కానీ ఆయన ఏ స్థాయి నిరాడంబరతతో ఉంటారు అన్న విషయం తెలిస్తే మాత్రం షాక్ అవుతారు.

రజనీకాంత్ నటించిన సినిమాలలో దళపతి సినిమాకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది . ఈ మూవీలో ఆయనతోపాటు అరవిందస్వామి నటించారు. ఇందులో అరవిందస్వామి రజినీకాంత్ తమ్ముడి పాత్ర పోషించారు. ఈ మూవీ తర్వాత అరవింద స్వామికి హీరోగా మంచి ఆఫర్లు కూడా వచ్చాయి. దళపతి చిత్రం స్టోరీ పరంగానే కాక మ్యూజిక్ పరంగా కూడా అప్పట్లో ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో రజనీకాంత్ చేసిన పని చూసి అరవిందస్వామి షాక్ అయ్యారట.

షూటింగ్ సమయంలో రజినీకాంత్ లాంటి పెద్ద హీరోతో ఎలా మింగిల్ అవ్వాలి అని మొదట్లో అరవిందస్వామి ఆలోచించేవారట. ఒకరోజు షూటింగ్ అయిన తర్వాత బాగా అలసిపోయిన అరవిందస్వామి తెలియకుండా రజనీకాంత్ గదిలోకి వెళ్ళాడు. అప్పటికే రూమ్ లో ఏసీ ఆన్ చేసి ఉండడంతో హ్యాపీగా మంచం పై పడుకొని హాయిగా నిద్రపోయాడు. తెల్లవారి లేచి చూసేసరికి అదే గదిలో నేలపై రజినీకాంత్ పడుకుని కనిపించారట.

ఇంకేముంది ఒక్కసారిగా అతనికి గుండెలు గుభేలుమన్నాయి. అనుకోకుండా ఏదో పెద్ద తప్పు చేశాను అన్న భావనతో నిద్రమత్తు ఎగిరిపోయింది. కంగారుగా నిద్రలేచిన అరవిందస్వామి బయటకు వెళ్లి యూనిట్ సభ్యులను ఏం జరిగింది అని ఆరా తీస్తే.. గదిలోకి వచ్చి ఆదమరచి నిద్రపోతున్న అరవింద స్వామిని చూసిన రజనీకాంత్.. ‘అతన్ని లేపొద్దు.. అక్కడే పడుకోనివ్వండి’అని తన అసిస్టెంట్ డైరెక్టర్ తో చెప్పారట. అంతేకాదు శుభ్రంగా నేల మీద పక్కా వేసుకొని పడుకొని నిద్రపోయారట. ఆ మాట విన్న అరవిందస్వామికి నిజజీవితంలో రజనీకాంత్ ఎంత నిరాడంబరంగా ఉంటారు అన్న విషయం అర్థమైంది.