రవితేజ-గోపిచంద్​ సినిమాలో శ్రీలీల కాదట.. ఎవరంటే

మాస్ మహారాజ రవితేజ – నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కలిసి నటించనున్నారా? వీరిద్దరి కలయికలో ఓ మూవీ తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయా? అంటే… అవుననే సమాచారం చిత్రసీమలో చక్కర్లు కొడుతోంది. ఈ కాంబోలో సినిమా దాదాపుగా ఖాయమేనని అంటున్నారు.

వివరాళ్లోకి వెళితే.. రవితేజ – దర్శకుడు గోపీచంద్ మలినేనిది బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబోలో హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి. ‘డాన్ శీను’తో మొదలైన వీరి ప్రయాణం ఆ తర్వాత ‘బలుపు’, ‘క్రాక్’ చిత్రాలు వచ్చి బాక్సాఫీస్ ముందు మంచి విజయం సాధించాయి. దీంతో ఇప్పుడు ఈ కాంబో నాలుగో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు.

మైత్రీ మూవీ మేకర్స్​ ఈ నాలుగోసారి రిపీట్​ కానున్న కాంబో సినిమాను నిర్మిస్తోంది. ‘వీర సింహా రెడ్డి’ వంటి భారీ విజయం తర్వాత ఆ బ్యానర్​లో గోపీచంద్ మలినేని చేస్తున్న సినిమా ఇది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి కలిసి ఈ సినిమాను గ్రాండ్​గా ప్రొడ్యూస్​ చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్​గా శ్రీలీల అన్నారు. కానీ ఇప్పుడు రష్మిక మందన్నా నటించనుందని కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. రీసెంట్​గా మేకర్స్ రష్మికను సంప్రదించగా.. ఆమె కథకు ఓకే చెప్పారని తెలిసింది.

ఇప్పటివరకు రవితేజ – రష్మిక కలిసి సినిమా చేయలేదు. కాబట్టి వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే.. కొత్తగా ఉంటుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట. ఎలాగో రష్మికకు నార్త్ ఇండియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇప్పటికే ఆమె గుడ్​ బై, మిషన్ మజ్ను, యానిమల్​లో నటించారు. యానిమల్ త్వరలోనే రిలీజ్ కానుంది. ప్రస్తుతం పుష్ప 2, ధనుష్ 51వ సినిమాలో కూడా నటిస్తోంది. ఇకపోతే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనే ఆమె ‘పుష్ప’ చేసింది. ‘పుష్ప 2’ చేస్తోంది. రష్మిక పాన్ ఇండియా క్రేజ్​ కూడా తమ సినిమాకు కలిసొస్తుందని మైత్రీ మూవీ మేకర్స్​ ఆమెను ఓకే చేశారట.

కాగా, రవితేజ, గోపీచంద్ మలినేని సినిమాకు తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే రవితేజ-తమన్ కాంబోలో వచ్చిన ‘బలుపు’, ‘క్రాక్’ మ్యూజికల్​గా మంచి హిట్ అయ్యాయి. అలాగే గోపిచంద్​-తమన్ కాంబోలో వచ్చిన ‘బాడీగార్డ్’​, ‘బలుపు’, ‘పండగ చేస్కో’, ‘విన్నర్’​, ‘క్రాక్’​, ‘వీరసింహారెడ్డి’ కూడా మ్యూజికల్​గా బానే ఉన్నాయి.