15 నెలల కిందట ‘కేజీఎఫ్’ అనే కన్నడ సినిమా ఎంతటి సంచలనాలకు తెర తీసిందో తెలిసిందే. కన్నడ సినిమాయే కదా అని లైట్ తీసుకున్న ఇతర భాషల ఫిలిం మేకర్స్‌కు ఆ చిత్రం దిమ్మదిరిగే షాకిచ్చింది. ఇక్కడ రిలీజైన లోకల్ సినిమాల్ని వెనక్కి నెట్టి బాక్సాఫీస్ లీడర్‌గా నిలిచింది.
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ.. ఇలా అన్ని భాషల్లో ‘కేజీఎఫ్’ సంచలన విజయం సాధించింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రాబోతున్న ‘కేజీఎఫ్-చాప్టర్ 2’పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో ఇతర భాషల వాళ్లు ఎదురు చూస్తున్న చిత్రమిదే. దీని విశేషాలు ఎప్పుడు మీడియాలో కనిపించినా జనాలు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
‘కేజీఎఫ్’ టీం నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం క్లైమాక్స్‌లో హీరో రాకీ భాయ్ ప్రాణాలు వదులుతాడట. గరుడను చంపాక కేజీఎఫ్‌ను తన సొంతం చేసుకున్న రాకీకి.. అధీర (సంజయ్ దత్) నుంచి సవాలు ఎదురవుతుంది. అతడితో పోరాడి గెలిచాక రాకీకి అసలు ఎదురే ఉండదు. ఐతే అతడి ఆధిపత్యాన్ని సహించలేక ప్రధాని (రవీనా టాండన్) అతణ్ని చంపించేస్తుందట.
ముందు ప్రభుత్వాన్ని గడగడలాడించిన రాకీ.. చివరికి కేజీఎఫ్ సింహాసనం మీద సగర్వంగా ప్రాణాలు వదులుతాడట. ఐతే రాకీకి ఎంతమంది ఎదురొచ్చినా తనకు తిరుగులేదన్నట్లుగా దూసుకెళ్లిపోవడం ‘చాప్టర్-1’లో చూశాం. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఈ స్థాయి హీరో ఎలివేషన్లున్న సినిమాలు అరుదు. అంతటి వీరుడిగా, యోధుడిగా రాకీని చూపించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.
అలాంటి హీరోను చివర్లో చంపేస్తే అభిమానులు తట్టుకోగలరా.. ఇలాంటి హీరో సెంట్రిక్ ఫిలింలో విషాదాంతాన్ని జీర్ణించుకోగలరా అన్నది సందేహం. మరి ఈ క్లైమాక్స్‌ను అతనెంత కన్విన్సింగ్‌గా మలిచాడో చూడాలి.