రాజధాని అమరావతి కట్టేశారుగా.!

మాటలతో కోటలు కట్టేయడమెలాగో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుగారికి తెలిసినంతగా, ఇంకెవరికీ తెలియదు. ఆయన ఎప్పుడో మాటల్లో అమరావతిని కట్టేశారు. 2014 ఎన్నికల ప్రచార సమయంలోనే అంతర్జాతీయ స్థాయి రాజధాని అమరావతిని చూపించేశారు గ్రాఫిక్స్‌లో. అఫ్‌కోర్స్‌, అప్పటికి అమరావతి అనిగానీ, కృష్ణా – గుంటూరు జిల్లాల్లో రాజధాని వుంటుందనిగానీ అధికారికంగా ప్రకటన కాలేదనుకోండి.. అది వేరే విషయం.

అప్పటికీ, ఇప్పటికీ ఏం మారింది.? అనడక్కండి. పేరు అమరావతి, ఫలానా ప్రాంతంలో నోటిఫై చేయబడిందది. అక్కడో తాత్కాలిక సచివాలయం. అంతకు మించి, ఇంకేమీ లేదక్కడ. శంకుస్థాపనలు, భూమి పూజలు లెక్కకు మిక్కిలిగా జరిగాయిగానీ, ఇంతవరకు అమరావతి పరిధిలో అధికారిక భవనం ఒక్కదాన్నీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించలేదు. అయినాగానీ, రాజధాని వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేసింది గనుక, రాష్ట్ర ప్రజలు చంద్రబాబు సర్కార్‌పై పూర్తి భరోసాతో వున్నారట. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.! అన్నట్టుంది కదూ.! అవును మరి, చంద్రబాబుకి బాకా ఊదే మీడియా నుంచి ఇంతకన్నా గొప్ప ప్రకటనలెలా వస్తాయ్‌.?

2018 అక్టోబర్‌లో ముందస్తు ఎన్నికలు రావొచ్చన్న ప్రచారం జరుగుతున్న వేళ, టీడీపీ అనుకూల మీడియా విశ్లేషణలు భలే కామెడీగా కనిపిస్తున్నాయి. రాజధాని వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేసిందట, పోలవరం ప్రాజెక్టుకీ రూపం వచ్చేసిందట. సో, 2018 అక్టోబర్‌లో ఎన్నికలొస్తే, అధికార పార్టీకి పూర్తిస్థాయిలో ఎడ్జ్‌ వుంటుందట. ఇదీ ‘పచ్చ కథ’.

రాజధాని అమరావతికి సంబంధించి అధికారికంగా ఒక్క గోడ కూడా కట్టలేదు. తాత్కాలిక సచివాలయం అనేది రాజధాని లెక్కల్లోకి రాదు కాబట్టి, అధికారిక భవనాల నిర్మాణం ప్రస్తుతానికి హంబక్కే. మై బ్రిక్‌ మై అమరావతి అన్నారు.. ఇంకేవేవో చెప్పేశారు.. అవన్నీ ఇప్పటికీ నీటి మీద రాతలే. ఇక, పోలవరం ప్రాజెక్టు విషయానికొస్తే, 40 వేల కోట్ల పైనే అవసరం అని చంద్రబాబు ఇంకా కథలు చెబుతూనే వున్నారు. ఆ లెక్కన ప్రాజెక్టు ఏ స్థితిలో వుందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

ముఖ్యమైన ఈ రెండు విషయాల్లోనే పరిస్థితి ఇంత ఘోరంగా వుంటే, టీడీపీకి 2018 ఎన్నికలొస్తే ఎడ్జ్‌ ఎలా వుంటుందట.? వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే.. ఎన్నయినా చెప్పొచ్చు. టీడీపీ అనుకూల మీడియా జనాన్ని ఎలా ట్రీట్‌ చేస్తోందో అర్థమవుతోంది కదూ.!