ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఎన్నికల్లో పార్టీలకు సలహాలు సూచనలు ఇచ్చే ఐప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ రాజ్యసభకు వెళ్లనున్నారా? అంటే ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి. 2014లో బీజేపీ తరఫున పనిచేసిన పీకే.. తాజాగా అదే బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని కూడగట్టే ప్రయత్నాల్లో తలమునకలై ఉన్న సంగతి తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో జేడీ(యూ) నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలను ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు ఆయన ప్రణాళిక ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను తమ పార్టీ కోటాలో రాజ్యసభకు పంపించాలని తృణమూల్ కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. పైగా త్వరలో బెంగాల్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ తరఫున పనిచేయడానికి పీకే ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇప్పటికే తృణమూల్ నేతలతో కలిసి పని చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ ను టీఎంసీ కోటాలో రాజ్యసభకు పంపిస్తే బావుంటుందని ఆ పార్టీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ యోచిస్తున్నట్టు సమాచారం. ప్రధాని మోదీని తీవ్రంగా వ్యతిరేకించేవారిలో ముందుంటే మమత.. తమ పార్టీ వాయిస్ జాతీయ స్థాయిలో బలంగా వినిపించగల నేతల కోసం అన్వేషిస్తున్నారు. ఎన్నికల వ్యూహాలలో ఆరితేరిన పీకే తమకు మంచి ఆప్షన్ అని ఆమె నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
పైగా ఆయన కూడా మోదీని, ఆయన విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో పీకేను రాజ్యసభకు పంపించాలని మమత నిర్ణయించారు. మార్చి 26న జరగబోయే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో టీఎంసీకి నాలుగు సీట్లు దక్కనున్నాయి. కాంగ్రెస్ లేదా సీపీఎం సహకారం తీసుకుంటే ఐదో సీటును కూడా ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అందులో ఒక సీటును పీకేకి ఇచ్చి రాజ్యసభలో బీజేపీకి వ్యతిరేకంగా తమ గళం వినిపించడం ఖాయంగా కనిపిస్తోం