రాజమౌళి సినిమాల్లో హీరో ఎలివేషన్స్ ఎలా ఉంటాయి?
ఈ ప్రశ్నకు ఆడియన్స్ ఎంత కావాలంటే అంత ఊహించుకోవచ్చు. ఎన్ని అంచనాలు కావాలంటే అన్ని అంచనాలు పెంచుకోవచ్చు. హీరోలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో, వాళ్లను రాజమౌళి ఎంత బలంగా చూపిస్తాడో బాహుబలి సినిమాలోనే చూశాం. ఇప్పుడు దానికి ఏమాత్రం తీసిపోని విధంగా వచ్చింది రామరాజు లుక్.
RRR నుంచి రామరాజు పాత్రధారి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ను జక్కన్న ప్రజెంట్ చేసిన విధానం అద్భుతం. దానికి కొమరం భీమ్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో స్పెషల్ ఎట్రాక్షన్. ఇక కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యాజిక్ చేసింది. కెమెరావర్క్ అయితే ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూసేలా చేస్తోంది.
1920 కాలానికి చెందిన రామరాజు పాత్రకు ఎంత ఫిక్షన్ యాడ్ చేయాలో రాజమౌళి అంతా చేశాడు. రామరాజు బాణం-విల్లు పట్టుకోవడమే కాదు… తుపాకీ కుడా పట్టాడు. బాక్సింగ్, కర్రసాము కూడా ప్రాక్టీస్ చేశాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ కాలంనాటి విద్యలన్నీ తెలిసిన మొనగాడిగా అల్లూరిని ప్రజెంట్ చేశాడు.
వీడియోలో ఎన్టీఆర్ తో పవర్ ఫుల్ లైన్స్ చెప్పించాడు రాజమౌళి. మరీ ముఖ్యంగా ఆడు కనబడితే నిప్పుకణం నిలబడినట్టుంటది, కలబడితే వేగుచుక్కు ఎగబడినట్టుంటది అనే లైన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. తెలంగాణ యాసలో ఎన్టీఆర్ చెప్పే ఈ డైలాగ్స్ తో అటు అతడి ఫ్యాన్స్, విజువల్స్ తో ఇటు మెగా ఫ్యాన్స్ కలిసి సెలబ్రేట్ చేసుకునేలా ఉంది ఈ వీడియో. ఈ ఒక్క వీడియోతో సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేశాడు రాజమౌళి.