రూట్ మార్చిన హీరో..లుక్ చూస్తుంటే బండి ప‌ట్టాలెక్కేలా!

బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా సినిమాలు చేసు కుంటూ వెళ్తోన్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని వ‌దిలి పెట్డం లేదు. అక్ష‌య్ ప్లాప్ ల‌పై ఎన్ని విమ‌ర్శ‌లొ చ్చినా ఎక్క‌డా ఆత్మ విశ్వాసం కోల్పోకుండా ప‌నిచేస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ అయిన `స‌ర్పిరా`, `ఖే ల్ ఖేల్ మే` కూడా డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. అయినా స‌రే కిలాడీ దూకుడు ఏమాత్రం త‌గ్గలేదు.

ఈ ఏడాది ఇంకా అక్ష‌య్ నుంచి రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇటీవ‌లే అక్ష‌య్ కుమార్ మ‌రోసారి స్టార్ మేక‌ర్ ప్రియ‌ద‌ర్శ‌న్ తోనూ చేతులు క‌లిపిన సంగతి తెలిసిందే. ఈ జోడీ 14 ఏళ్ల త‌ర్వాత క‌లిసి చేస్తున్న చిత్రం ఇదే. అక్ష‌య్ హీరో కెరీర్ ఊపందుకోవ‌డంలో `హేరాఫేరి` చిత్రం కూడా ఒక‌టి గా నిలిచింది. దీన్ని ప్రియ‌ద‌ర్శ‌న్ తెర‌కెక్కించారు.

ఇద్ద‌రి కాంబినేష‌న్ లో అంత గొప్ప చిత్రం తెర‌కెక్కిన త‌ర్వాత మ‌ళ్లీ 2010 లో `క‌ట్టా మిట్టా`తో క‌లిసి ప‌నిచేసారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ వాళ్లిద్ద‌రు క‌లిసి ప‌నిచేసింది లేదు. బాలీవుడ్ లో అక్ష‌య్ కుమార్…సౌత్ లో ప్రియ‌ద‌ర్శ‌న్ ఎన్నో సినిమాలు చేసారు గానీ…స‌క్సెస్ కాంబినేష‌న్ మాత్రం ఆ ఛాన్స్ ఇంత కాలం తీసుకోలేదు. తాజాగా ద‌శాబ్దం త‌ర్వాత మ‌ళ్లీ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా కొత్త పోస్ట‌ర్ రిలీజ్ అయింది. అక్ష‌య్ లుక్ ఆద్యంతం అదిరిపోయింది. బ్లాక్ షూట్ అక్ష‌య్ లుక్ ఇంట్రెస్టింగ్ . అక్ష‌య్ భుజాల‌పై న‌ల్ల‌టి పిల్లి గాండ్రిపు…అక్ష‌య్ పాలు తాగుతోన్న వైనం ఆక‌ట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ లో బూత్ బంగ్లా భ‌యంక‌రంగా ఉంది. ఇది హారర్ థ్రిల్ల‌ర్ క‌థలా ఉంది. అక్ష‌య్ లో కామెడీ టైమింగ్ ని బేస్ ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సెప్టెంబ‌ర్ నుంచి రెగ్య‌ల‌ర్ షూటింగ్ మొద‌లుకానుంది. ఈ చిత్రాన్ని ఏక్తాక‌పూర్ నిర్మిస్తున్నారు.