రేవంత్‌ వర్సెస్‌ కేశవ్‌: రాజకీయ ’పచ్చ‘ వ్యాపారం

రాజకీయ నాయకుల దృష్టిలో జనమే వెర్రి వెంగళప్పలు. నిజమే మరి, లేకపోతే టీడీపీ – టీఆర్‌ఎస్‌ మధ్య ‘వ్యాపార లావాదేవీలు’ ఓ పక్క ఘనంగా జరుగుతోంటే, ఇంకోపక్క రాజకీయ పోరాటం మాత్రం జనం కోసం జరుగుతుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?

పయ్యావుల కేశవ్‌, పరిటాల సునీత, యనమల రామకృష్ణుడు.. తెలంగాణలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారట. అదీ, తెలంగాణలోని అధికార టీఆర్‌ఎస్‌ అండదండలతో. ఈ విషయాన్ని బయటపెట్టింది ఇంకెవరో కాదు, సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి. ‘మీరు టీఆర్‌ఎస్‌తో అంటకాగడం వల్లే, మా పరిస్థితి తెలంగాణలో దారుణంగా తయారయ్యింది..’ అంటూ రేవంత్‌రెడ్డి పెద్ద ‘బాంబు’ పేల్చిన విషయం విదితమే.

మరి, రేవంత్‌ విమర్శలకు ఏపీ టీడీపీ నేతల నుంచి కౌంటర్‌ రావాలి కదా.! అదీ రానే వచ్చింది. టీడీపీ నేత పయ్యవుల కేశవ్‌ ఈ రోజు మీడియా ముందుకొచ్చారు. రేవంత్‌రెడ్డి – కేసీఆర్‌ కుమార్తె కవిత కలిసి వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అంతేనా, జగన్‌తో రేవంత్‌రెడ్డి అంటకాగిన మాట వాస్తవమని పయ్యావుల కేశవ్‌ స్పష్టం చేశారు. దానికి తగ్గ ఆధారాలు తన వద్ద వున్నాయంటున్నారు పయ్యావుల కేశవ్‌.

విదేశీ పర్యటనలో బిజీగా వున్న టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగొచ్చాక, ఆయనతో సమావేశమవుతానని, పార్టీలోనే కొనసాగుతానని రేవంత్‌రెడ్డి ‘యూ-టర్న్‌’ తీసుకున్నాక, ఢిల్లీలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పెద్దలతో ఏమేం మంతనాలు జరిపారో సాక్ష్యంగా నిరూపిస్తానని పయ్యావుల కేశవ్‌ చెప్పడాన్ని ఏమనుకోవాలి.? సరే అది, టీడీపీ అంతర్గత విషయం. రేప్పొద్దున్న అంతా ఒక్కటై, పయ్యావుల నిఖార్సయినోడని రేవంత్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి మహానుభావుడని పయ్యావుల అనొచ్చుగాక.!

కానీ, టీఆర్‌ఎస్‌తో టీడీపీ నేతల వ్యాపారాల సంగతేంటి.? తెలుగు ప్రజలకు టీడీపీ అధిష్టానం ఈ ‘అక్రమ’ వ్యాపారాలపై సమాధానం చెప్పి తీరాల్సిందే.