రేవంత్ ను ఫిక్స్ చేసే పనిలో టీఆర్ఎస్

తెలంగాణలో గులాబీ బాస్ కేసీఆర్ కు వ్యతిరేకంగా గళం విప్పే నేతల్లో మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. ఈ విషయంలో ఆయన చాలా దూకుడు ప్రదర్శిస్తుంటారు. దీంతో టీఆర్ఎస్ సైతం రేవంత్ ను ఇరుకున పెట్టడానికి అవకాశం ఉన్న ఏ అంశాన్నీ వదిలిపెట్టదు. ఈ నేపథ్యంలోనే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆయన్ను చాలా ఇబ్బంది పెట్టింది.

ప్రత్యేకంగా ఆయన నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి, ఎన్నికల్లో ఆయన కంచుకోటను బద్దలు చేసి, తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత కొంత సైలెంట్ అయిన రేవంత్ రెడ్డి.. లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి మళ్లీ క్రియాశీలంగా వ్యవహరిస్తూ టీఆర్ఎస్ పై పోరుకు ఉపక్రమించారు.

టీఆర్ఎస్ హయాంలో చోటుచేసుకున్న పలు భూముల కేటాయింపుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ న్యాయస్థానంలో పోరాడుతున్నారు. అదే సమయంలో పట్టణ ప్రగతి కార్యక్రమానికి ధీటుగా పట్నం గోస పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు. మరోవైపు టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. రేసులో రేవంత్ పేరు కూడా వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో రేవంత్ పై భూ కబ్జా ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.

హైదరాబాద్ గోపన్ పల్లిలో కొంత భూమిని రేవంత్, ఆయన సోదరుడు అక్రమంగా స్వాధీనంగా చేసుకున్నారంటూ ఫిర్యాదు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై సీరియస్ గా దృష్టి పెట్టిన సర్కారు.. రేవంత్ కు సహకరించారనే కారణతో ఓ డిప్యూటీ కలెక్టర్ ను సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంలో రేవంత్ ను ఫిక్స్ చేసే దిశగా గులాబీ పార్టీ కదులుతోంది. దీంతోపాటు ఉప్పల్ లోని భూమి కొనుగోలుపైనా అక్రమాలు చోటు చేసుకున్నాయని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీనిపై కూడా ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. తద్వారా తమను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్న రేవంత్ ను ఫిక్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

నిజానికి ఓటుకు నోటు కేసులో రేవంత్ అడ్డంగా దొరికిపోయారు. అయితే, తర్వాత కొన్ని ‘కారణాల’ నేపథ్యంలో ఈ కేసు అటకెక్కింది. దీంతో ఆ కేసు కాకుండా మిగిలిన కేసులపైనే టీఆర్ఎస్ సర్కారు ఫోకస్ పెట్టింది. ఈ వ్యవహారంతో రేవంత్ టీపీసీసీ ఆశలు గల్లంతయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు.