లాక్ డౌన్ తో కొన్ని కోట్ల జీవితాలు స్తంభించిపోయాయి. లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు నష్టపోయాయి. వ్యవహారాలు, వ్యాపారాలు అన్నీ ఎక్కడికక్కడ స్తంభించిపోయిన నేపథ్యంలో.. అన్ని వర్గాలకు చెందిన విద్యార్థి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోని అందరూ దెబ్బతినిపోయారు. అయితే అన్నదాతల విషయంలో మాత్రం తెలుగురాష్ట్రాల్లోని రెడు ప్రభుత్వాలూ చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. అన్నదాతలకు సంబంధించి మాత్రం లాక్ డౌన్ నిబంధనలను సడలించాయి.
ఈ విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులూ తమ తమ రాష్ట్రాల పరిధిలో ఏమేం చేయవచ్చునో అన్నీ చేస్తున్నారు. రైతులకు ఏమేం అవసరమో అవన్నీ చేస్తున్నారు. ప్రధానంగా ఉత్పత్తులు కోత సమయానికి వచ్చి ఉన్నచోట్ల లాక్ డౌన్ కారణంగా కోతలు ఆగిపోతేత.. పంట మొత్తం ఎందుకూ పనికిరాకుండా పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వారికి ఇబ్బంది రాకుండా ప్రభుత్వాలు సకల చర్యలు తీసుకుంటున్నాయి.
వ్యవసాయ కూలీలు ఒకచోటనుంచి మరొకచోటికి వెళ్లడానికి అనుమతులు ఇస్తున్నారు. అదే తరహాలో వ్యవసాయ సంబంధిత వాహనాల రవాణాపూ కూడా ఆంక్షలు తగ్గించారు. రైతన్నలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరిన్ని వెసులుబాట్లు ప్రకటిస్తున్నారు. కోతల సమయం కావడంతో.. రైతులు ఏమాత్రం ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని.. ప్రతి గింజను, ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని.. ప్రకటించిన మద్దతు ధరలకే సమస్తం కొనుగోలు చేస్తామని ఆయన ప్రకటించారు. రైతులు తమ తమ ప్రదేశాల్లోనే ఉండవచ్చునని, అధికారులే వారి వారి ఇళ్లవద్దకు వచ్చి దిగుబడులు కొనేలా ఏర్పాట్లు చేశామని కేసీఆర్ ప్రకటించారు. దీనివల్ల రెండు ప్రయోజనాలు నెరవేరే అవకాశం ఉంది. ఈ క్లిష్ట సమయంలో రైతులు తమ దిగుబడులు వారు రవాణా చేసి తీసుకురావడం మొదలైతే వాహనాలన్నీ గందరగోళం అవుతాయి. కరోనా వ్యాప్తికి మార్గం సుగమం చేసినట్లు అవుతుంది. రైతులే వారి దగ్గరకు వెళ్లి కొనుగోళ్లు చేస్తే.. ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ తెలియకుండా సాంతం జరిగిపోతుంది.
రెండు ప్రభుత్వాలూ అన్నదాతలకోసం గరిష్టంగా శ్రద్ధపెట్టినట్లు తెలుస్తోంది.