లుక్స్ సూపర్.. కానీ కంటెంట్?

స్టార్ హీరోలు రకరకాల వేషాలు వేస్తూ అభిమానుల్ని మురిపించే రోజులు పోయాయి. ఆరేడు దశాబ్దాల కిందటే అక్కినేని నాగేశ్వరరావు ‘నవరాత్రి’ అనే సినిమాలో తొమ్మిది రకాల వేషధారణల్లో కనిపించి ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత మరెందరో హీరోలు ఇలా వేషాలు మార్చే పాత్రలు చేశారు. కమల్ హాసన్ ఈ తరహా ప్రయత్నాలు చాలానే చేశాడు. పుష్కరం కిందట ఆయన ‘దశావతారం’లో ఒకేసారి పది పాత్రలతో ముచ్చట తీర్చుకున్నాడు.

ఐతే ఆ సినిమాతో ఈ తరహా ప్రయత్నాలకు కాలం చెల్లినట్లే కనిపించింది. జనాలకు కూడా ఈ టైపు సినిమాలు మొహం మొత్తేశాయి. కమల్ తర్వాత ఈ రకమైన పిచ్చి ఉన్న హీరో విక్రమ్ కూడా ఇంతకుముందు కొన్ని సినిమాల్లో రకరకాల వేషాలేశాడు. అయినా ఆయనకు సంతృప్తి ఉన్నట్లు లేదు.

మళ్లీ ఈ వేషాలు మార్చే పాత్ర ఒకటి చేస్తున్నాడు విక్రమ్. ఆ సినిమానే.. కోబ్రా. డీమాంటి కాలనీ, అంజలి ఐపీఎస్ లాంటి డిఫరెంట్ థ్రిల్లర్లు తీసిన అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ నటిస్తున్న చిత్రమిది. ఈ దర్శకుడు ఇంతకుముందు చేసిన సినిమాల్ని బట్టి చూస్తే దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ ఇలాంటి ఎగ్జైటింగ్ డైరెక్టర్లు విక్రమ్‌తో పని చేసినపుడు దారి తప్పుతుండటం గమనార్హం. ఇంతకుముందు ‘అరిమా నంబి’ అనే సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన ఆనంద్ శంకర్.. విక్రమ్‌తో సినిమా అనేసరికి ‘ఇరు ముగున్’ (ఇంకొక్కడు) అనే డిజాస్టర్ తీశాడు. అందులోనూ విక్రమ్ వేషాల పిచ్చి కనిపించింది. ఇలాంటి సినిమాలు చాలానే విక్రమ్‌కు చేదు అనుభవాలు మిగిల్చినప్పటికీ.. అతను మారలేదు.

‘కోబ్రా’ కోసం మళ్లీ వేషాలు మారుస్తున్నాడు. తాజాగా విక్రమ్‌ను ఏడు రకాల అవతారాల్లో చూపిస్తూ ఫస్ట్ లుక్ వదిలారు. ఆ లుక్స్ అన్నీ బాగున్నాయి. వెరైటీగా అనిపిస్తున్నాయి. కానీ ఇలా ఎన్ని వేషాలు వేసినా.. సినిమాలో విషయం ఉంటేనే ఆడుతుందనే విషయం విక్రమ్ అర్థం చేసుకుంటే మంచిది.