‘లూసిఫర్’ కోసం రంగంలోకి దిగిన కేజీఎఫ్..!

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ సక్సెస్ రేటు దారుణంగా పడిపోయింది. లూసిఫర్ సినిమా తర్వాత ఆయన నుండి ఆ స్థాయి సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ స్థాయి విజయం సొంతం చేసుకోగల సత్తా ఉన్న సినిమా రాలేదు.

ఈ సమయంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆ స్థాయి విజయం కోసం మళ్లీ అదే సినిమా యొక్క సీక్వెల్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. లూసీఫర్ యొక్క సీక్వెల్ కోసం స్క్రిప్ట్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. మొదటి పార్ట్ కు దర్శకత్వం వహించిన పృథ్వీ రాజ్ సుకుమార్ సీక్వెల్ కి కూడా దర్శకత్వం వహించబోతున్నాడు.

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు సీక్వెల్ కి కంటిన్యూ అవ్వబోతున్నారు. అయితే నిర్మాణ సంస్థలో మార్పు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

లూసిఫర్ సినిమా ను భారీ బడ్జెట్ తో నిర్మించాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే మొదటి పార్ట్ ని నిర్మించిన నిర్మాణ సంస్థతో కలిసి మరో పెద్ద నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం లూసిఫర్ 2 సినిమా నిర్మాణంలో కేజీఎఫ్ నిర్మాణ సంస్థ అయిన హోంబళే వారు భాగస్వామ్యం అవ్వబోతున్నారు. ఈ మధ్య కాలంలో హోంబళే నిర్మాణ సంస్థ సౌత్ లోని అన్ని భాషల్లో భారీ చిత్రాలను నిర్మిస్తోంది.

ఈ సమయంలోనే మరో భారీ సినిమాకు రెడీ అయ్యింది. ఈ సినిమా కోసం హోంబళే సంస్థ భారీ మొత్తంలో ఖర్చు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. హోంబళే సంస్థ వారి ఎంట్రీ తో కచ్చితంగా లూసిఫర్ 2 సినిమా స్థాయి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటూ మలయాళ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.