వైసీపీతో జీవీఎల్‌ దోస్తీ.. మరోమారు బట్టబయలైంది.!

అసలు జీవీఎల్‌ నరసింహారావు భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడేనా.? లేదంటే, ఆయనేమన్నా వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారా.? చాలామందికి ఈ విషయమై చాలా అనుమానాలున్నాయి. ఆ అనుమానాలకు ఎప్పటికప్పుడు బలాన్నిచ్చేలా ఆయన వ్యవహారశౖలి కన్పిస్తోంది. తాజాగా, అమరావతిలో పేదలకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్న ఆలోచనను జీవీఎల్‌ నరసింహారావు సమర్థించారు.

నిజానికి, పేదలకు ఇళ్ళ స్థలాల్ని ప్రభుత్వం ఇస్తామంటే ఎవరూ కాదనరు. కానీ, ఇక్కడ విషయం వేరు. విజయవాడ, గుంటూరు నగరాలకి చెందిన ప్రజలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ళ స్థలాలు ఇస్తారట. అవీ ఒక సెంటు చొప్పున మాత్రమే.

పైగా, ఏ ప్రాంతాన్ని అయితే స్మశానంగా మంత్రి బొత్స సత్యనారాయణ అభివర్ణించారో, ఏ ప్రాంతాన్ని అయితే ముంపు ప్రాంతమని అదే బొత్స చెప్పుకొచ్చారో, ఏ ప్రాంతాన్నయితే ఎడారిగా స్పీకర్‌ తమ్మినేని సీతారాం అభివర్ణించారో.. ఆ అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తారట. పాపం.. విజయవాడ, గుంటూరులో వుంటోన్న పేదల్ని ఏం చేద్దామని రాష్ట్రంలోని అధికార పార్టీ ఈ ఆలోచన చేస్తోందో ఏమో.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, దాన్ని అభినందించేయాలని బహుశా జీవీఎల్‌ కంకణం కట్టుకుని వున్నట్టున్నారు. లేకపోతే, బీజేపీకి కొత్త మిత్రపక్షం జనసేన వ్యతిరేకిస్తున్నా.. ఆఖరికి సొంత పార్టీ రాష్ట్ర శాఖ, ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నా జీవీఎల్‌ మాత్రం, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మీద అపారమైన ప్రేమని చాటుకుంటూనే వున్నారు.

ఈ వ్యవహారంపై రాష్ట్ర బీజేపీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ‘ఇలాగైతే విపక్షంగా బీజేపీ పోరాటాలు చేయడం దండగ.. బీజేపీ అగ్రనాయకత్వం ఈ విషయమై కరిÄన నిర్ణయం తీసుకోవాల్సిందే..’ అని ఓ బీజేపీ నేత ఆఫ్‌ ది రికార్డ్‌గా తన అసహనాన్ని మీడియా మిత్రుల వద్ద వ్యక్తం చేస్తున్నారట. మరోపక్క, జీవీఎల్‌ తీరుపై జనసేన పార్టీ కూడా అసహనం వ్యక్తం చేస్తోంది.

జీవీఎల్‌ తీరుని బీజేపీ అధిష్టానం వద్ద ఎండగట్టేందుకు జనసేన పార్టీ సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. దానికి ఏపీ బీజేపీ నేతలు కూడా మద్దతిస్తున్నారని సమాచారం.