వైసీపీ ఓట్లు ‘పది‘లమేనా?

ఏపీలో స్థానిక సమరానికి తెర లేచింది. ఈ ఎన్నికల్లో భారీ విజయం సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో అధికార వైసీపీ ప్రణాళిక ప్రకారం సాగుతోంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినంత భారీ విజయం ఈసారీ సొంతమవుతుందా? అప్పటి వైసీపీ ఓట్లన్నీ పదిలంగానే ఉన్నాయా అనే అంశంపై చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్న బీసీలు మొన్నటి ఎన్నికల్లో వైసీపీ పక్షాన నిలిచారు. దీంతో వారు చేజారిపోకుండా చూసుకునేందు జగన్ వారికి మంచి ప్రాధాన్యతే ఇస్తున్నారు. అయితే, బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తీసుకొచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేయడంతో దాదాపు 10 శాతం మేర పదవులను వారు కోల్పోయే పరిస్థితి వచ్చింది.

దీంతో ఆ పది శాతం పదవులను పార్టీపరంగా భర్తీ చేయాలని వైసీపీ అధినేత కీలక నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ విషయం టీడీపీ అనుకూల పత్రికలు మరుగున పడేశాయి. ఇది కచ్చితంగా జగన్ కు లబ్ధి కలిగించే అంశం కావడంతో ఆ వార్తను ఇగ్నోర్ చేశాయి. దీంతో బీసీ సంఘాల్లోకి ఈ విషయం గట్టిగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని వైసీపీ పెద్దలు నిర్ణయించారు. ఆ మేరకు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయించారు. అలాగే దీనిపై ఫీడ్ బ్యాక్ ఏమిటో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

మరోవైపు జగన్ తీసుకున్న నిర్ణయం టీడీపీని ఇరుకున పెట్టినట్టయింది. ఇప్పటికే తమ పార్టీకి చెందిన నేత హైకోర్టుకు వెళ్లడం వల్లే బీసీలకు రిజర్వేషన్లలో కోత పడిందనే అంశానని అధికార పార్టీ బాగా హైలైట్ చేస్తోంది. దీంతో తాము బీసీలకు వ్యతిరేకం కాదనే విషయాన్ని చాటి చెప్పేందుకు ఈ విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, అక్కడ కూడా అనుకూల తీర్పు వచ్చే పరిస్థితి లేదని కొందరు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే జగన్ తెలివిగా వ్యవహరించి ఆ పది శాతం పదవులు పార్టీ ద్వారా బీసీలకు వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో బీసీలందరూ ఈ ఎన్నికల్లో కూడా తమ వెంటే నిలుస్తారని భావిస్తున్నారు. బీసీ సంఘాల్లో కూడా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇక సంక్షేమ పథకాల ద్వారా పేదలకు లబ్ధి చేకూరుతోంది. ఒక్క ఇసుక, పింఛన్ల కోత, రాజధాని వ్యవహారం మినహా మిగిలిన అంశాల్లో వైసీపీపై అంత వ్యతిరేకత లేదు. ఈ నేపథ్యంలో పింఛన్ల విషయంలో కూడా అధికార పార్టీ తాను చేసిన తప్పును కొంతవరకు సరిదిద్దుకుంది.

గతనెలలో పింఛన్లు రానివారిలో చాలా మందికి ఈనెల పింఛన్లు అందజేసింది. అయినప్పటికీ ఆదాయపన్ను పరిధిలో ఉన్నవారికి మాత్రం పింఛన్లు అందలేదు. ఇదొక్కటి మినహా మిగిలిన ఏ అంశమైనా వైసీపీకి అనుకూంగా ఓట్లు తెచ్చిపెట్టే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి వైసీపీ ఓట్లన్నీ పదిలంగా ఉన్నాయా లేదా అనే విషయం ఈనెలఖరున వెలువడే స్థానిక ఫలితాలతో తేలిపోతుంది.