వైసీపీ బహిష్కరణ: టీడీపీకి అడ్వాంటేజ్‌ ఎంత.?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించింది. జగన్‌ పాదయాత్ర నేపథ్యంలో టీడీపీ వ్యూహాత్మకంగా అసెంబ్లీ సమావేశాల్ని ప్లాన్‌ చేసిందనే కారణం కావొచ్చు, పార్టీ ఫిరాయింపులకు వైఎస్సార్సీపీ నిరసన అనే కారణం కావొచ్చు.. కారణమేదైతేనేం, అసెంబ్లీకి సంబంధించినంతవరకు తెలుగుదేశం పార్టీకి ఇది ‘కంప్లీట్‌ అడ్వాంటేజ్‌’ అయ్యే అవకాశాలు సుస్పష్టం. ప్రతిరోజూ అసెంబ్లీలో విపక్షాల లొల్లి వుండదు. అసలు విపక్షమే లేనప్పుడు, లొల్లి ఎలా వుంటుంది.? ఏ బిల్లు మీద అయినా అభ్యంతరాలు కన్పించవు. మీడియా పాయింట్‌ మొత్తాన్ని ఆక్రమించేయొచ్చు.. ఇలా చెప్పుకుంటూ పోతే, టీడీపీకి వున్న అడ్వాంటేజెస్‌ అన్నీ ఇన్నీ కావు.!

అయితే, 2014 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో ఏనాడూ, ప్రతిపక్షానికి తగిన ‘గౌరవం’ దక్కిన దాఖలాల్లేవు. ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ ఏదన్నా మాట మాట్లాడాలనుకుంటే, వెంటనే అధికారపక్షం నుంచి లేచి, ‘అక్రమాస్తుల కేసు’ అంశాన్ని ప్రస్తావించడం మామూలే. అలాంటి చర్యల్ని ఏనాడూ స్పీకర్‌ తప్పు పట్టింది లేదు. ప్రతిపక్ష నేత ప్రసంగానికి అధికారపక్షం అడ్డు తగులుతోంటే, అధికార పక్షాన్ని ఎంకరేజ్‌ చేయడానికేనా స్పీకర్‌ పదవి.? అన్నట్టు స్పీకర్‌ వ్యవహరించడం అంతా చూస్తూనే వున్నాం.

అధికార పార్టీ నేత, చేతితో సైగ చేస్తే చాలు, ఆ సైగ ప్రకారం అసెంబ్లీని స్పీకర్‌ వాయిదా వేయించేస్తుంటారు. ఇదీ గడచిన మూడున్నరేళ్ళుగా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు. ఇకపై అంతలా కష్టపడాల్సిన అవసరం అధికార పార్టీకి లేదు. కావాల్సినంత సేపు సభ నడుపుకోవచ్చు, అవసరం లేదనుకుంటే వాయిదా వేసెయ్యొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే, అసెంబ్లీలో అధికారపక్షం, దాని మిత్రపక్షం కాలక్షేపం చేసేయడానికి మార్గం సుగమమయ్యింది.

ఈ ఎపిసోడ్‌లో వైఎస్సార్సీపీపై టీడీపీ చేస్తున్న విమర్శల మాటేమిటి.? వైఎస్సార్సీపీ అసెంబ్లీకి హాజరైతే ఇంతకన్నా దారుణమైన విమర్శలే ఎదురవుతాయి. వాటిని తిప్పి కొట్టేందుకు అసెంబ్లీలో ప్రతిపక్షానికి ఎలాగూ అవకాశం దొరకదు. మీడియా పాయింట్‌ వద్ద కూడా వైఎస్సార్సీపీకి ఛాన్స్‌ ఇవ్వడంలేదు అధికారపక్షం. దాంతో, చెప్పాలనుకున్నదేదో ప్రజలకే చెప్పుకోవాలని ప్రతిపక్షం, జగన్‌ పాదయాత్రను అందుకు వేదికగా ఉపయోగించుకోనుండడాన్ని ఎలా తప్పు పట్టగలం.?

జగన్‌ మీద అక్రమాస్తుల కేసు వుంది గనుక, అలాంటి ప్రతిపక్ష నేత వుండడం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల దురదృష్టమన్నది అధికార పార్టీ నేతలు ఇప్పుడు మరింత గట్టిగా చేస్తున్న వాదన. అవునా,? అలాగైతే, ఓటుకు నోటు కేసులో ‘బ్రీఫింగ్‌’ చేస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికేసిన వ్యక్తి, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వుండడం ఇంకెంత దౌర్భాగ్యం.? ఆ బ్రీఫింగ్‌ చేసింది తాను కాదని ఇప్పటిదాకా చంద్రబాబు చెప్పలేదంటే, దానర్థమేంటి.!

‘పార్టీ ఫిరాయించినోళ్ళపై చర్యలు తీసుకోండి.. అడ్డగోలుగా మంత్రులైన మా పార్టీ ఎమ్మెల్యేలను బర్త్‌రఫ్‌ చేయండి.. అప్పుడు అసెంబ్లీకి హాజరవుతాం..’ అనడం ద్వారా కంప్లీట్‌గా జగన్‌ అండ్‌ కో అసెంబ్లీ బహిష్కరణపై తమను తాము పూర్తిగా డిఫెండ్‌ చేసుకోగలగుతోంది. ఈ కండిషన్స్‌ అప్లయ్‌ అనేది లేకపోతు, బహిష్కరణ నీరుగారిపోయేదే. కండిషన్‌ మామూలుగా లేదు కదా.! అందుకే, అధికార పార్టీకి అంత ఉలుకు.