‘అది ప్రజా వ్యతిరేకత..’ అంటూ సాక్షాత్తూ హోంమంత్రి మేకతోటి సుచరిత, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై విశాఖపట్నంలో జరిగిన దాడి గురించి అభివర్ణించారంటే, అలాంటి దాడుల్ని ప్రభుత్వం సమర్థిస్తున్నట్లే కదా.? మొన్నామధ్య వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేని రాజధాని అమరావతి రైతులు అడ్డుకుంటే, ఏకంగా హత్యాయత్నం కేసులు పెట్టేశారు. కానీ, ఇక్కడ చంద్రబాబు మీద టమోటాలు, కోడిగుడ్లతోపాటు, పెట్రోల్ బాటిళ్ళు, రాళ్ళతో దాడి జరిగితే, ‘ప్రజా వ్యతిరేకత’ అంటున్నారు.
అమరావతిలో 70 రోజులకు పైగా ఆందోళనలు జరుగుతోంటే, రైతుల్ని రెచ్చగొట్టేందుకు.. వారు దీక్షలు చేస్తోన్న శిబిరాల ముందు నుంచే అధికార పార్టీ నేతలు ర్యాలీలు తీస్తుండడాన్ని ఏమనుకోవాలి.? అంటే, ఇక్కడ వైసీపీ ఏదో ఆశిస్తోంది. అది రాష్ట్రంలో అలజడిని రేకెత్తించాలనే అయితే, అది ఏమాత్రం క్షమార్హం కాదు.
వైసీపీ ఎమ్మెల్యే మీద రైతులు హత్యాయత్నం చేసింది నిజమే అయితే, విశాఖలో చంద్రబాబుపై జరిగింది కూడా హత్యాయత్నమే. కానీ, అధికార పార్టీ విషయంలో ఒకలా కేసులు నమోదవుతున్నాయి, ప్రతిపక్ష నేత విషయంలో పరిస్థితి ఇంకోలా వుంటోంది. ఈ విషయాన్నే హైకోర్టు దృష్టికి తీసుకెళుతున్నారు టీడీపీ నేతలు.
మరోపక్క, న్యాయస్థానం కూడా పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. పర్యటనకు అనుమతినిచ్చి, అరెస్టు చేయడమేంటి.? అని పోలీసుల్ని న్యాయస్థానం ప్రశ్నిస్తే, పోలీసుల వద్ద సరైన సమాధానం దొరకలేదు. దానర్థం, పోలీసు వ్యవస్థ సమాధానం చెప్పలేని స్థాయికి.. పరిస్థితుల్ని ప్రభుత్వమే దిగజార్చేసిందన్నమాట.
మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ మాత్రమే కాదు, ఆఖరికి స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే.. ఇలాంటి పరిస్థితులు తప్పవని చెబుతున్నారు. అసలిక్కడ ప్రజాభిప్రాయానికి ప్రభుత్వాలు గౌరవమిస్తున్నాయా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
చంద్రబాబుపై దాడులు సబబే అని ప్రభుత్వం చెప్పదలచుకుంటే, రేప్పొద్దున్న అమరావతిలో ఆందోళనలు చేస్తున్న రైతులు ‘అదుపు’ కోల్పోతే, దానికి నైతిక బాధ్యత ఎవరు వహిస్తారు.? ముఖ్యమంత్రి, అసెంబ్లీకి అయినా వెళ్ళగలరా.? ఎమ్మెల్యే రోజాని రైతులు అడ్డుకుంటే, ‘మీకు అసెంబ్లీ కూడా వద్దా.?’ అని బెదిరించారామె. అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఇంకొక న్యాయం. అసలిది ప్రజాస్వామ్యమేనా.?