జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కర్నూలులో ‘జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి’ అంటూ భారీ ర్యాలీ నిర్వహించిన విషయం విదితమే. స్కూల్‌లోనే ఓ విద్యార్థినిపై హత్యాచారం జరిగిన ఘటనపై పవన్ కళ్యాణ్ గళం విప్పారు.. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని నినదించారు. కన్న బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు, తమకు న్యాయం జరగాలంటూ ప్రభుత్వాల చుట్టూ తిరిగి అనేక అవమానాల్ని ఎదుర్కొన్నారు.
గతంలో చంద్రబాబు ప్రభుత్వం, ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని అవమానించింది. ఓ మంత్రి తమను అవమానించిన తీరుపై బాధిత కుటుంబం, పవన్ కళ్యాణ్ వద్ద చెప్పుకుని వాపోయారు. దాంతో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఆ కుటుంబానికి అండగా ర్యాలీ నిర్వహిస్తే.. పవన్‌కళ్యాణ్‌ని అడ్డుకునేందుకు వైసీపీ వేసిన వెకిలి వేషాలు అన్నీ ఇన్నీ కావు.
‘చంద్రబాబు హయాంలో ఆ ఘటన జరిగితే, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం.?’ అని నిర్లజ్జగా మాట్లాడారు కొందరు. కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనతోనే వైఎస్ జగన్ ప్రభుత్వం కళ్ళు తెరిచింది. ‘ముఖ్యమంత్రి కర్నూలుకి వస్తున్నారు కదా.. ఆయన్ని నిలదీయండి..’ అని జనసేన అధినేత పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కర్నూలు పర్యటన సందర్భంగా బాధిత కుటుంబాన్ని పిలిపించుకుని, మాట్లాడారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
మొత్తమ్మీద, బాధిత కుటుంబానికి కాస్త ఊరటగా, వైఎస్ జగన్ ప్రభుత్వం కేసుని సీబీఐ విచారణకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు.
అయితే, ‘జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి’ అంటూ జనసేన అధినేత నినదిస్తే, అది వైసీపీ అనుకూల మీడియాలో వార్తగా మారలేదు. లక్షలాది జనం, జనసేన అధినేతతో గొంతు కలిపితే, వార్త రాయడానికి సదరు మీడియాకి ధైర్యం సరిపోలేదు. కానీ, ఇప్పుడు జనసేన అధినేత, జగన్ ప్రభుత్వాన్ని అభినందిస్తే.. అది వార్తగా మారింది. ఇదీ వైసీపీ రాజ్యాంగం.. వైసీపీ అనుకూల మీడియా అనుసరిస్తోన్న రాజ్యాంగం.