సీఎం రిలీఫ్ ఫండ్ కు వచ్చే డబ్బులతో ఏం కొనాలో చెప్పేసిన కేసీఆర్

కరోనా వేళ.. ఎవరికి వారు వారికి తోచినంత మొత్తాన్ని విరాళాల రూపంలో అందిస్తున్న సంగతి తెలిసిందే. మరి.. ఇలా వచ్చిన మొత్తాల్ని దేని కోసం వినియోగిస్తున్నారు? దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారు? అన్న క్వశ్చన్లు రావటం ఖాయం. సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద ఎత్తున వస్తున్న నిధుల్ని దేని కోసం వినియోగించాలి? ఏమేం కొనాలన్న విషయంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు.

కరోనా వ్యాప్తిని నిరోధించే విషయంలోనూ వైద్యులు.. వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున సేవ చేస్తున్నారు. వారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ తెలంగాణ సీఎం ఆసక్తికర నిర్ణయాన్ని వెల్లడించారు. విరాళాల రూపంలో వచ్చే మొత్తాల్ని.. వైద్యులకు.. వైద్య సిబ్బందికి అవసరమయ్యే మాస్కులు.. పీపీఈలు.. మందుల కొనుగోలు కోసం ఉపయోగించాలని కోరారు.

తెలంగాణలోని కరోనా వార్డుల్లో పని చేస్తున్న వారికి సరైన సదుపాయాలు లేవన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెద్దగా తీసుకోవటం లేదని.. బాడీసూట్లకు బదులుగా.. యాప్రాన్లు.. మాస్కులు పెట్టుకొని పని చేస్తున్నారని.. ఇదంతా చాలా ప్రమాదకరంగా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి వరకూ వెళ్లినట్లుగా తెలుస్తోంది.

ఈ కారణంతోనే విరాళాల రూపంలో వచ్చే మొత్తాలతో వైద్యులు.. వైద్య సిబ్బందికి అవసరమైన సామాగ్రి కొనుగోలు కోసం వినియోగించాలన్న కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు కేసీఆర్. మొత్తానికి మీడియా సమావేశంలో ప్రశ్నించే మీడియాప్రతినిధులపై ఎదురుదాడి చేసే సీఎం కేసీఆర్.. పత్రికల్లో వచ్చే వార్తల విషయంలో మాత్రం సీరియస్ గా ఉంటున్న వైనం తాజా నిర్ణయాన్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు.