సూపర్ స్టార్.. ఎందుకంత భయమో!

సినిమాల్లో ఓ స్థాయి అందుకోగానే చాలామంది స్టార్లకు రాజకీయాల వైపు మనసు మళ్లుతుంది. అందులోనూ తమిళనాట చాలామంది సినిమా స్టార్ల చివరి గమ్యం రాజకీయాలే అవుతాయి. ఐతే రాజకీయాల్లో అడుగుపెట్టిన వాళ్లందరూ విజయవంతం అయిపోతారనేమీ లేదు.

ఆ రంగంలోకి అడుగుపెడితే విజయవంతం అవుతామని పూర్తి విశ్వాసం ఉంటే తప్ప అటువైపు అందరూ అడుగు వేయరు. ఐతే తిరుగులేని ఇమేజ్ ఉండి.. మంచివాడిగా గుర్తింపు సంపాదించి.. జనాల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండి.. అటు వైపు అడుగులేస్తే కచ్చితంగా విజయవంతం అవుతామన్న భరోసా కూడా కనిపిస్తున్నపుడు కూడా ఒక స్టార్ సైలెంటుగా ఉండిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం అలాంటి స్థితిలోనే ఉన్నాడు.

గతంలో ఎప్పుడో రాజకీయాల్లో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయని.. ఇప్పుడు తనకు అత్యంత అనుకూలంగా కనిపిస్తున్న స్థితిలోనూ ఆయన పాలిటిక్స్ అంటే దండం పెట్టేస్తున్నారు. జయలలిత మరణించిన నేపథ్యంలో నాయకత్వ లోటుతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు తమిళ జనాలు. అటువైపు కరుణానిధి ఉన్నా లేనట్లే అన్నట్లుంది. స్టాలిన్ కు కరుణానిధి స్థాయి లేదు. ఇటువైపు జయకు దరిదాపుల్లో ఉన్న నేత అన్నాడీఎంకేలో కనిపించడం లేదు. అమ్మ మరణించిన నెల రోజులకే ఆ పార్టీలో తీవ్ర స్థాయి లుకలుకలు బయటపడుతున్నాయి.

రాబోయే రోజుల్లో ఆ పార్టీ కుక్కలు చింపిన విస్తరి అయ్యేలా ఉంది. ఇలాంటి స్థితిలో రజినీ రాజకీయ అరంగేట్రం చేస్తే సులభంగా సీఎం అయిపోవచ్చు. అధికార అన్నాడీఎంకే నేతలే ఆయన్ని సీఎం చేయడానికి సిద్ధమైతే ఆశ్చర్యమేమీ లేదు. కానీ రజినీ మాత్రం ఆ దిశగా ఆసక్తి చూపిస్తున్నట్లు లేదు. 2004 ఎన్నికల్లో తన మాటను అనుసరించి ఎన్డీయేకు జనాలు ఓట్లేయకపోవడం చూసి.. రజినీలో తన స్టామినా మీద అనుమానం పట్టుకున్నట్లుంది. రాజకీయాల రొచ్చులోకి దిగి ఇప్పుడున్న ఇమేజ్ ను దెబ్బ తీసుకోవడం ఎందుకని ఆయన భావిస్తున్నారో ఏమో.

కానీ 2004 నాటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు వేరు. ప్రస్తుత రాజకీయ శూన్యతను భర్తీ చేయాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. అందుకే అభిమానులు కూడా ఒక్కతాటిపైకి వచ్చి రజినీని రాజకీయాల్లోకి రప్పించేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. ఈ దిశగా తమిళనాట పలుచోట్ల పొలిటికల్ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో రజినీ ఆలోచన ఏమైనా మారుతుందేమో చూడాలి.