స్పెషల్‌ : బంగార్రాజులో సమంత!

అక్కినేని ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బంగార్రాజు చిత్రంకు సంబంధించిన స్క్రిప్ట్‌ చర్చలు ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నట్లుగా ఇండస్ట్రీకి చెందిన ఒక పీఆర్‌ చెప్పుకొచ్చాడు. ఆయన చెప్పినదాని ప్రకారం కళ్యాణ్‌ కృష్ణ ప్రస్తుతం బంగార్రాజు స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నాడట. అదే సమయంలో సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించబోతుండగా నాగచైతన్యకు జోడీగా సమంత నటించబోతుంది అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

నాగచైతన్య బంగార్రాజు చిత్రంలో కనిపించబోతున్నట్లుగా చాలా రోజులుగానే వార్తలు వస్తున్నాయి. కాని సమంత కూడా ఈ సీక్వెల్‌లో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సోగ్గాడు లెవల్‌ లోనే ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ తెరకెక్కిస్తాడని అక్కినేని ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నాగార్జున ప్రస్తుతం వైల్డ్‌ డాగ్‌ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. ఆ తర్వాత కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు చిత్రం ఉంటుందని సమాచారం అందుతోంది. నాగార్జున ఈ సినిమాను నిర్మించడంతో పాటు సమంత నటిస్తున్న కారణంగా అంచనాలు పీక్స్‌ లో ఉన్నాయి.

ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేసే విషయమై కూడా ఆలోచిస్తున్నట్లుగా ఆ పీఆర్‌ చెప్పుకొచ్చాడు. విడుదల విషయంలోనే కాస్త కన్ఫ్యూజన్‌ ఉంది. ఇతర విషయాలపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. గత ఏడాది మజిలీతో హిట్‌ కొట్టిన అక్కినేని జంట బంగార్రాజులో నటిస్తే మరో హిట్‌ ఖాయం అంటూ అక్కినేని ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు.