కరోనా మహమ్మారిని కట్టడి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఏప్రిల్ 14వరకు భారత్ అంతా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అంతర్రాష్ట్ర సరిహద్దులను ఏపీ సర్కార్ మూసివేసింది.
అయితే, తెలంగాణలో హాస్టళ్లు మూసివేసినందున తాము స్వస్థలాలకు వెళ్లేందుకు వచ్చామని కొందరు ఏపీకి చెందిన విద్యార్థులు, ఉద్యోగులు…పొందుగుల వద్ద ఏపీ సరిహద్దుకు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆరోగ్య పరీక్షలు నిర్వహించి..14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండేందుకు అంగీకరిస్తేనే అనుమతిస్తామని ఏపీ సర్కార్ తేల్చి చెప్పింది.
ఈ నేపథ్యంలోనే పొందుగుల వద్ద పోలీసులపై రాళ్లదాడి కూడా జరిగింది. దీంతో, ఈ వ్యవహారంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆరోగ్యపరంగా బాగున్నవారిని ఏపీలోకి అనుమతించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ నుంచి ఏపీకి బయల్దేరిన విద్యార్థులు, ఐటీ ఉద్యోగులను ఏపీలోని పలు సరిహద్దుల వద్ద ఏపీ పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో..హైకోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ ఇచ్చిన ఎన్ఓసీని ఎంట్రీ పాయింట్ లోనే పరిశీలించాలని ఏపీ పోలీసులకు ఆదేశించింది.
ఆరోగ్యపరంగా బాగున్నవారిని అనుమతించాలని, ఆరోగ్యంగా లేనివారిని క్వారంటైన్ కు తరలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్వారంటైన్ అవసరం లేనివారిని హోమ్ క్వారంటైన్ లో ఉంచాలని, ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్ర సరిహద్దుల్లో ఏపీ ప్రజలను నిలిపివేయడంపై బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ వేసిన పిటిషన్ ను విచారణ జరిపిన కోర్టు…పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది.