పది కోట్ల దర్శకుడు.. 330 డాలర్లు తెచ్చాడు

టాలీవుడ్లో హీరోలతో సమానంగా ఇమేజ్ సంపాదించిన దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. హీరో ఎవరైనా సరే.. కేవలం ఆయన పేరు చూసి థియేటర్లకు వచ్చేస్తుంటారు ప్రేక్షకులు. కానీ ఇదంతా గతం. గత కొన్నేళ్లలో డిజాస్టర్ల మీద డిజాస్టర్లు తీసిన పూరి.. తన ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేసుకున్నాడు. ఆ ప్రభావం అంతా ఆయన కొత్త సినిమా ‘రోగ్’ మీద పడింది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన వసూళ్లు వచ్చాయి.

ఫస్ట్ డే నుంచి ఎక్కడా ఒక్క షో అంటే ఒక్క షో కూడా హౌసేఫుల్  పడిన దాఖలాలు లేవు. ఐతే తెలుగు రాష్ట్రాల్లో కనీసం నామమాత్రంగా అయినా వసూళ్లున్నాయి. కానీ అమెరికాలోనే పరిస్థితి దారుణాతి దారుణం. ఈ చిత్రాన్ని అమెరికాలో ఏదో రిలీజ్ చేశామంటే రిలీజ్ చేశాం అనిపించారు. అక్కడ ఈ చిత్రానికి మరీ ఘోరంగా 330 డాలర్ల వసూళ్లు మాత్రమే వచ్చాయట. ఓ స్టార్ డైరెక్టర్ సినిమాకు ఇలాంటి వసూళ్లంటే షాకవ్వాల్సిందే.

‘రోగ్’ మీద అంచనాలేమీ లేకపోయినప్పటికీ.. పూరి జగన్నాథ్ సినిమా కాబట్టి ఓ మోస్తరుగా అయినా ఓపెనింగ్స్ వస్తాయనుకున్నారు. కానీ పరిస్థితి మరీ ఇంత ఘోరంగా ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. ‘రోగ్’ సినిమాకు పూరి రూ.10 కోట్ల పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. మరి అంత రెమ్యూనరేషన్ తీసుకుని పూరి ఎలాంటి సినిమా ఇచ్చాడో తెలిసిందే. ఈ మధ్య మంచు మనోజ్ సినిమా ‘గుంటూరోడు’కు కూడా అమెరికాలో దయనీయమైన పరిస్థితి ఎదురైంది. కానీ ఆ చిత్రం కనీసం వేల డాలర్లయినా వసూలు చేసింది. కానీ పూరి సినిమా వందలకు పడిపోయింది. తాను తీసిన సినిమాల వల్ల తన ఇమేజ్ ఏ స్థాయిలో డ్యామేజ్ అయిందో పూరి ఇప్పటికైనా గ్రహించి కొంచెం క్వాలిటీ కోసం ప్రయత్నిస్తే బెటర్.