100 కోట్ల ఆస్తి నస్టపోయిన చంద్రమోహన్..!

ప్రముఖ నటుడు వర్సటైల్ యాక్టర్ చంద్రమోహన్ కన్నుమూత సినీ పరిశ్రమను శోక సముద్రంలో ముంచెత్తింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన ఆయన ఎన్నో కోట్ల మంది ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. రంగుల రాట్నం సినిమాతో తెరంగేట్రం చేసిన చంద్రమోహన్ పదహారేళ్ల వయసు, సిరి సిరి మువ్వ సినిమాలతో అలరించారు. ఇవే కాదు మరపురాని కథ, బంగారు పిచ్చుక, కలికాలం, ఆమె, సగటు మనిషి సినిమాల్లో తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలిచారు.

తెలుగు సినీ పరిశ్రమలో 50 ఏళ్ల ప్రస్థానం కొనసాగించిన ఆయన సినిమాలు చేసే టైం లో ఆర్థికంగా బాగానే ఉన్నా ఆ తర్వాత ఇబ్బందులు పడ్డారని తెలుస్తుంది. రీసెంట్ ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దాదాపు 100 కోట్ల దాకా నష్టపోయినట్టు చెప్పారు. కొంపల్లిలో 35 ఎకరాల ద్రాక్ష తోట కొన్న చంద్ర మోహన్ దాన్ని చూసుకునే వారు లేక దాన్ని అమ్మేశారట. అది ఇప్పుడు కోట్లలో ధర పలుకుతుంది. ఇక చెన్నైలో కూడా 15 ఎకరాలు ఇలానే చూసుకునే వారు లేక అమ్మాల్సి వచ్చింది. దాని విలువ 30 కోట్ల దాకా ఉంటుంది.

అలా తీసుకున్న భూమిని కూడా సరిగా చూసుకోలేక నష్టానికి అమ్ముకోవాల్సి వచ్చిందని వాటి వల్ల 100 కోట్ల దాకా నష్టం వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు చంద్ర మోహన్. నటుడిగా కెరీర్ మొదలు పెట్టి ఎలాంటి పాత్రలు వచ్చినా చేస్తూ వచ్చిన చంద్ర మోహన్ సోలో హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశారు. ఇక ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన చాలా సినిమాలు చేశారు.

ముఖ్యంగా తండ్రి, బాబాయ్, మామయ్య ఇలాంటి పాత్రలో చంద్రమోహన్ గారు బాగా నటించారు. 2017 ఆక్సిజన్ సినిమాలో ఆయన చివరిగా నటించారు. కొన్నాళ్లుగా అనారోగ్యం తో బాధపడుతున్న చంద్ర మోహన్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. చంద్రమోహన్ మృతి చెందిన వార్త తెలిసిన సినీ ప్రముఖులు ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నివాళి అందిస్తున్నారు.