16 కోట్ల పెట్టించేసిన డైరక్టర్?

ఏ డైరక్టర్ అయినా తను నమ్మిన సబ్జెక్ట్ ను, తన టేస్ట్ నే కాదు, తను ఏ హీరోతో సినిమా చేస్తున్నాడో, ఆ హీరో మార్కెట్ ను కూడా చూడాలి. డైరక్టర్ ప్రవీణ్ సత్తారు మాత్రం అందుకు రివర్స్ లో వెళుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి దాకా చిన్న చిన్న సినిమాలు డీల్ చేసిన ప్రవీణ్ సత్తారు ఒక్కసారిగా భారీ సినిమాను ఎంచుకున్నారు.

చాలా కాలంగా తెరకు దూరంగా వున్న హీరో రాజశేఖర్ తో గరుడవేగ సినిమా స్టార్ట్ చేసారు. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు అనుకున్న బడ్జెట్ ను ఇప్పడు దాటేసినట్లు వినికిడి. దాదాపు 16కోట్ల వరకు అయిందని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. విదేశాల్లో భారీ వాటర్ చేజింగ్ లు, బ్లాస్టింగ్ లు, ఇలాంటి భారీ సీన్లు అన్నీ తీసారు.

సబ్జెక్ట్ మీద నమ్మకం వుండి వుండొచ్చు. సినిమా హిట్ అయితే అంతకు అంతా వస్తుందని అనుకోవచ్చు. కానీ రాజశేఖర్ కు దాదాపు దశాబ్ధకాంలంగా హిట్ లేదు. ఇవ్వాళ, రేపు డైరక్టర్ క్రేజ్, హీరో క్రేజ్ వున్నా కూడా ఓపెనింగ్స్ రావడం కష్టం అవుతోంది. మరి అలాంటిది రాజశేఖర్-ప్రవీణ్ కాంబినేషన్ కు మంచి ఓపెనింగ్స్ రాకుండా ఇంత మొత్తం రికవరీ అంటే కష్టం. ఇక మిగిలింది సినిమాకు పబ్లిసిటీతో వీలయినంత బజ్ తీసుకురావడం, మౌత్ టాక్ బాగుండడం మాత్రమే.