మాస్ మహారాజా రవితేజ హీరోగా ఖిలాడీ సినిమా రూపొందుతోంది. ఒకటి రెండు వారాల్లో షూటింగ్ ముగియబోతుంది అనుకుంటూ ఉండగా కరోనా సెకండ్ వేవ్ వచ్చి షూటింగ్ నిలిచి పోయింది. చిత్రీకరణ మొదలు పెట్టడం కోసం రవితేజ మరో సినిమాను కూడా రెడీగా పెట్టాడు. శరత్ మండవ దర్శకత్వంలో రూపొందబోతున్న ఆ సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ శివారులో 1990 వాతావరణంతో రాయలసీమలోని ఒక పల్లెను సెట్ గా తీర్చి దిద్దుతున్నారు. మెజార్టీ షూటింగ్ ఆ సెట్ లోనే నిర్వహించబోతున్నారట.
రాయలసీమకు చెందిన ఎన్నో ఫ్యాక్షన్ సినిమాలు ఇప్పటికే వచ్చాయి. కాని ఈ సినిమా చాలా విభిన్నంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాలో రవితేజ 1990 హీరో మాదిరిగా కనిపించబోతున్నాడు. వింటేజ్ లుక్ తో పాటు కాస్త విభిన్నమైన మ్యానరిజంను కూడా రవితేజ కనబర్చబోతున్నాడు. ఇక రాయలసీమ యాసను రవితేజ ఈ సినిమా కోసం చెప్పబోతున్నాడు. సినిమా మొత్తం కూడా రవితేజ రాయలసీమ యాసలోనే మాట్లాడుతాడంటూ సమాచారం అందుతోంది. షూటింగ్ త్వరలోనే ప్రారంభించి వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు వెళ్లడించే అవకాశం ఉంది.