బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 21వ శతాబ్దపు 25 ఉత్తమ చిత్రాల జాబితాను వెలువరించింది. ఒక సౌత్ సూపర్ స్టార్ నటించిన ఈ బాక్సాఫీస్ డిజాస్టర్ మూవీ.. ఈ జాబితాలో నిలవడం సంచలనమైంది. ఇంతకీ అది ఏ సినిమా? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (బిఎఫ్ఐ) ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక చలనచిత్ర సంస్థలలో ఒకటి. BFI మామూలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ సినిమాల జాబితాతో సంకలనాలను అందజేస్తుంది. దీని ప్రచురణ `సైట్ అండ్ సౌండ్` ఇటీవలే 2024 సంచికను వెలువరించింది. ఈ మ్యాగజైన్ లో 21వ శతాబ్దపు 25 ఉత్తమ చిత్రాల జాబితాను వెలువరించగా అది ప్రముఖ విమర్శకుల దృష్టిని ఆకర్షించింది. ఈ జాబితాలో ఒక భారతీయ చిత్రం మాత్రమే చేరింది. ఇది చాలా మంది ఊహించిన సినిమా కాదు. 3 ఇడియట్స్, RRR, లగాన్, దంగల్, దేవదాస్, బాహుబలి ఇవేవీ ఈ జాబితాలో లేవు. ఈ లిస్ట్ లో ఒక డిజాస్టర్ సినిమా ఉంది.
`సైట్ అండ్ సౌండ్ ఫిల్మ్స్ ఆఫ్ ది సెంచరీ`లో 21వ శతాబ్దం (2000-2024) మొదటి 25 సంవత్సరాల నుండి 25 చిత్రాలున్నాయి. ప్రచురణకు 25 మంది విమర్శకులు 25 చిత్రాలను ఎంపిక చేశారు – ప్రతి సంవత్సరం నుంచి ఒక సినిమా ఎంపికైంది – వారు 21వ శతాబ్దానికి వీటిని ఉదాహరణగా భావించారు. వారు అప్పటి బెస్ట్ ని మాత్రమే ఎంపిక చేసుకున్నారు. ఓల్డ్‌బాయ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గెట్ అవుట్, ఎ హిస్టరీ ఆఫ్ వాయిలెన్స్ వంటి పలు విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే ఇందులో ఒకే ఒక్క భారతీయ చిత్రం నిలిచింది. అది రజనీకాంత్ నటించిన కాలా. పా. రంజిత్ తెరకెక్కించిన ఈ చిత్రం 2018లో విడుదలైంది. రజనీకాంత్, నానా పటేకర్, ఈశ్వరీ రావు, హుమా ఖురేషి, సముద్రఖని, పంకజ్ త్రిపాఠి, అంజలి పాటిల్ తదితరులు ఇందులో నటించారు. 140 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించబడిన కాలా 159 కోట్ల రూపాయలను రాబట్టింది. చాలా మంది దీనిని బిలో యావరేజ్ సినిమాగా విశ్లేషించారు. రజనీకాంత్ టైటిల్ రోల్‌లో నటించిన కాలా, కుల అణచివేత, భూకబ్జా వంటి సమస్యల నేపథ్యంలో హీరోయిజాన్ని ఆవిష్కరించింది. యాక్షన్ తో పాటు ఇందులో సౌండ్‌ట్రాక్ లకు ప్రశంసలు దక్కాయి. కానీ క్రిటిక్స్ నుంచి విమర్శలను ఎదుర్కొంది.
సైట్ అండ్ సౌండ్ యొక్క ఉత్తమ చిత్రాల జాబితాలో 2018 సంవత్సరానికి `కాలా` ప్రాతినిధ్యం వహించింది. బ్లాక్ పాంథర్, బోహేమియన్ రాప్సోడీ, రోమా, గ్రీన్ బుక్ వంటి సినిమాలతో పాటు, అంధాధున్, మహానటి వంటి కొన్ని అద్భుతమైన భారతీయ చిత్రాలు అదే సంవత్సరం విడుదలైనా కానీ కాలా అన్నిటినీ డామినేట్ చేసింది కాలా.
మొత్తంమీద ఈ అరుదైన జాబితాలో భారతదేశం నుండి కాలా మాత్రమే ప్రతినిధిగా చోటు దక్కించుకోవడం చాలా మంది అభిమానులను ఆశ్చర్యపరిచింది. 2000 నుండి అనేక భారతీయ చిత్రాలు విదేశాలలో అవార్డులను గెలుచుకున్నాయి. లగాన్ ప్రముఖంగా ఆస్కార్‌ల తుది దశకు చేరుకుంది. RRR ఒరిజినల్ మ్యూజిక్ కేటగిరీలో ఆస్కార్ గెలుచుకుంది. సంజయ్ లీలా భన్సాలీ – దేవదాస్ కేన్స్‌లో పురస్కారం అందుకుంది. రితేష్ బాత్రా `లంచ్‌బాక్స్` పలు సినిమా ఉత్సవాల్లో ప్రీమియర్ అయింది. బాహుబలి, మై నేమ్ ఈజ్ ఖాన్, 3 ఇడియట్స్, దంగల్ వంటి చిత్రాలన్నీ ఓవర్సీస్‌లో ప్రశంసలతో పాటు కమర్షియల్ గా భారీ విజయాన్ని అందుకున్నాయి. కానీ వాటిలో ఏవీ ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో చేరలేదు.