ఇండియన్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ ఉంది. పదుల దేశాల్లో సినిమా థియేటర్ల ద్వారా స్క్రీనింగ్ అవుతూ ఉంటే.. వందల దేశాల్లో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెల్సిందే. ఎన్నో దేశాల్లో ఇండియన్ సినిమా ను జనాలు ఆధరిస్తున్నారు.. కానీ పక్కన ఉన్న బంగ్లాదేశ్ లో మాత్రం 52 ఏళ్లుగా ఇండియన్ సినిమా బొమ్మ థియేటర్ లో పడలేదు.
1971 దేశ విభజన తర్వాత పలు కారణాల కారణంగా ఇతర దేశాల సినిమాలు బంగ్లాదేశ్ లో అనధికారికంగా నిషేదించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా బంగ్లాదేశ్ లో ఇండియన్ సినిమాలు థియేటర్ రిలీజ్ కు నోచుకోలేదు. ఇండియన్ సినిమాలను చూడాలి అంటే టీవీ లేదా ఇంటర్నెట్ ద్వారా మాత్రమే వారు చూస్తున్నారు.
ఎట్టకేలకు ఒక ఇండియన్ సినిమా బంగ్లాదేశ్ లో థియేట్రికల్ స్క్రీనింగ్ కు రెడీ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా పఠాన్ ను ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేసినా కూడా బంగ్లా లో మాత్రం స్ట్రీమింగ్ చేయలేదు. అక్కడ నేరుగా ఓటీటీ ద్వారా కాకుండా థియేట్రికల్ స్క్రీనింగ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి దుమ్ము రేపిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో బంగ్లా లో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. దేశం మొత్తంలో కూడా దాదాపుగా 150 థియేటర్లు ఉన్నట్లుగా సమాచారం.
పఠాన్ ను అక్కడ దాదాపుగా 100 స్క్రీన్స్ లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లో స్క్రీనింగ్ కు డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా అక్కడ హిట్ అయితే ఇండియన్ సినిమాలు మరిన్ని బంగ్లా లో విడుదల అవ్వడంతో పాటు ఇతర దేశాల నుండి కార్పోరేట్ సంస్థలు కూడా వచ్చి మల్టీ ప్లెక్స్ లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు.
50 ఏళ్లుగా బంగ్లా సినీ ప్రేమికులు ఇండియన్ సినిమాలను థియేటర్లలో చూడాలని.. అలాగే మల్టీ ప్లెక్స్ లు రావాలని ఆశ పడుతున్నారు. వారి కోరిక తీరబోతుంది.. వారి ఎదురు చూపులకు తెర పడబోతుంది అంటూ స్థానిక ఫిల్మ్ మేకర్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.