పోయినేడాది కన్నడలో ఓ సినిమా క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ సందర్భంగా ఇద్దరు నటులు నదిలో పడి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన గుర్తుండే ఉంటుంది. అది దునియా విజయ్ అనే నటుడు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం. ఈ విషాద ఘటనకు సంబంధించి ఆ చిత్ర దర్శక నిర్మాతలు.. హీరో మీద అప్పట్లో కేసులు పెట్టారు. ఆ కేసులు ఏమయ్యాయో కానీ.. దునియా విజయ్ మీద కన్నడ సినీ పరిశ్రమ అనధికారిక నిషేధం విధించింది. ఈ విషాదానికి అతనే కారణం అంటూ అతడికి అవకాశాలివ్వట్లేదు. ఐతే ఆ నటుడికి ఇప్పుడు తెలుగులో ఒక క్రేజీ ప్రాజెక్టులో విలన్గా అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. ఆ చిత్రం మరేదో కాదు.. జై లవకుశ.
నిన్ననే శ్రీరామనవమి సందర్భంగా ‘జై లవ కుశ’ లోగో మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక షూటింగ్ జోరు కూడా కొంచెం పెంచాలని ఫిక్సయ్యారు. ఈ సినిమా నెల రోజుల నుంచి షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ అవి చిన్న చిన్న సీన్లే. ఇంకా ఇద్దరు హీరోయిన్లను.. విలన్లను ఫైనలైజ్ చేయలేదు.
హీరోయిన్లుగా నివేదా థామస్, సమంతలను ఓకే చేసి.. విలన్ పాత్రల సంగతి కూడా తేల్చేసే పనిలో ఉన్నారు దర్శకుడు బాబీ.. నిర్మాత కళ్యాణ్ రామ్. దునియా విజయ్ను ఒక విలన్ పాత్రకు తీసుకోవాలని అనుకుంటున్నారట. అతను మరో ఆలోచన లేకుండా ఈ సినిమాకు ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.