తెలంగాణ.. ఉద్యమాల పురిటి గడ్డ.! ఇంతకీ, ఆ ఉద్యమాలు ఎవరికి వ్యతిరేకంగా జరిగాయి.? ఈ ప్రశ్నకు సమాధానం అందరికీ తెల్సిందే. నిజాం పాలనలో అరాచకాలకు వ్యతిరేకంగా.! అయితే, అది గతం. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. చరిత్రను కొత్తగా రాసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ‘కంకణం’ కట్టేసుకున్నారు.
సమైక్య రాష్ట్రంలో నిజాం పాలన పట్ల వ్యతిరేక ప్రచారం జరిగిందనీ, నిజానికి నిజాం పాలన చాలా గొప్పదని కేసీఆర్ చెబుతున్నారు. ఆనాటి ఆ వైభవం గురించి నేటి తరానికి తెలియాల్సి వుందంటున్న కేసీఆర్ తీరు చూస్తోంటే, ఆ చరిత్రను స్వయంగా తానే రచించినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.!
ఇదంతా ఎందుకు.? అంటే, ఇంకెందుకు మజ్లిస్ పార్టీ మెప్పు పొందేందుకు, తెలంగాణలో మైనార్టీ ఓటు బ్యాంకుని ‘ఫిక్స్‌డ్ డిపాజిట్’ చేసుకునేందుకు.. అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. మొత్తమ్మీద, ‘మరుగునపడ్డ నిజాం ఘన చరిత్ర’ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ‘గులాబీ’ సిరాతో రాయబోతున్నారన్నమాట. మజ్లిస్ పార్టీ కూడా, నిజాం పాలనను ఇంత గొప్పగా ఎప్పుడూ కీర్తించి వుండదు.
తెలంగాణ ఉద్యమంలో, ‘నిజాం పాలనకు ఎదురొడ్డి నిలిచింది తెలంగాణ సమాజం..’ అంటూ ఇదే, తెలంగాణ రాష్ట్ర సమితి జనంలోకి వెళ్ళి, తెలంగాణ ఉద్యమాన్ని హోరెత్తించిన విషయం విదితమే. కానీ, అదే తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది. అప్పుడది ఉద్యమ పార్టీ. ఇప్పుడు రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీలకు రంగులు మార్చేయడం సహజమే. ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీ చేస్తున్నదీ అదే.