నేనా.. పవన్‌తో సినిమానా?

pawanపవర్ స్టార్ పవన్ కళ్యాన్ కొన్ని నెలల వ్యవధిలో మూడు సినిమాలకు శ్రీకారం చుట్టాడు. అందులో ఒక్కటే సెట్స్ మీదికి వెళ్లింది. మిగతా రెండు సినిమాలకు ప్రి ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది ప్రస్తుతం. ఆ సినిమాల్లో నటీనటులు.. సాంకేతిక నిపుణులు వీళ్లే అంటూ రోజుకో వార్త వస్తోంది మీడియాలో. అందులో భాగంగానే తమిళ డైరెక్టర్ టీఎన్ నీశన్ దర్శకత్వంలో పవన్ చేయబోయే సినిమాలో హీరోయిన్ అంటూ ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి. ముందు నయనతార.. త్రిష లాంటి సీనియర్ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఆపై చివరగా ‘అఖిల్’ హీరోయిన్ సాయేషా సైగల్ ఈ సినిమాకు కన్ఫమ్ అయిపోయినట్లు వార్తలొచ్చాయి.

ఈ రూమర్లు ముంబయి వరకు వెళ్లిపోవడంతో సాయేషా అలర్ట్ అయింది. తాను పవన్ సినిమాలో చేయట్లేదని క్లారిటీ ఇచ్చింది. “పవన్ కళ్యాణ్ సార్‌తో సినిమా చేసే అవకాశం వస్తే అది అదృష్టమే. కానీ దురదృష్టవశాత్తూ నాకు అలాంటి ఆఫర్ ఏమీ రాలేదు” అని స్పష్టం చేసింది సాయేషా. తాను ప్రస్తుతం తెలుగులో ఇంకే సినిమా కూడా సైన్ చేయలేదని కూడా సాయేషా తెలిపింది. సాయేషా తొలి సినిమా డిజాస్టర్.. పైగా ఆమె నటన.. గ్లామర్ పరంగా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో పవన్ పక్కన సాయేషా అనగానే అభిమానులు కొంచెం కంగారు పడ్డారు. పైగా చిన్న పిల్లలా కనిపించే సాయేషా పవన్ పక్కన ఎలా ఉంటుందో అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇప్పుడు స్వయంగా సాయేషానే ఈ సినిమాలో తాను నటించట్లేదని అనడంతో అభిమానులు హ్యాపీగా ఫీలవుతారేమో.