చెల్లెలి కోసం ఎన్నారై వరుడిని వెతికే క్రమంలో.. అక్కకు ఊహించని షాక్ !

బెంగళూరు: తన చెల్లిని ఎన్నారైకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది ఓ అక్క. అనుకున్నదే తడువుగా వరుడి వేటలో పడింది. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా ఆమె చెల్లికి ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని పేరు అండ్రీవ్ కొహెన్. తాను భారత సంతతి వ్యక్తినని, తనకు బ్రిటన్ పౌరసత్వం ఉందని చెప్పాడు. అతడిని తన అక్కకు పరిచయం చేసింది చెల్లి. వారితో కొహెన్ బాగా కలిసిపోయాడు. దీంతో మాటల్లో తన చెల్లిని ఎన్నారైకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నానని చెప్పింది అక్క.

ఇదే అదునుగా భావించిన అతగాడు.. ఆమె చెల్లిని తానే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అనంతరం సదరు వ్యక్తి ఆ అక్క చెల్లెళ్లతో తరచూ వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసేవాడు. ఈ క్రమంలో 2019, డిసెంబర్ 31న వారిద్దరికి కొత్త సంవత్సరం గిఫ్ట్స్ పంపిస్తున్నట్లు చెప్పాడు. అనంతరం జనవరి 6 నుంచి 27 వరకు ఆ అక్క చెల్లెళ్లకు వాట్సాప్ ద్వారా కస్టమ్స్ అధికారుల పేరిట కాల్స్ వచ్చాయి.

మీకు బ్రిటన్ నుంచి గిఫ్ట్స్ వచ్చాయని అవి డెలివరీ చేయాలంటే చార్జీలు కట్టాలని వివిధ దఫాలలో సుమారు రూ. 71లక్షల 57వేలు తమ ఖాతాలలో జమా చేయించుకున్నారు. కానీ, రోజులు గడుస్తున్న గిఫ్ట్స్ రాకపోవడంతో ఆ అక్క చెల్లెళ్లకు  అనుమానం వచ్చింది. వారికి ఫోన్లు వచ్చిన నెంబర్లకు తిరిగి కాంటాక్ట్ చేయడంతో స్విచ్ఛాఫ్‌ అని వచ్చాయి. దాంతో తాము మోసపోయామని గ్రహించిన అక్క చెల్లెళ్లు బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు వాట్సాప్‌లో చాటింగ్ చేసిన అండ్రీవ్ కొహెన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.