అంబానీ మొహమ్మీదే తెగేసి చెప్పిన జగన్!

భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాల్ని సైతం కనుసన్నలతో శాసించే సుదృఢమైన వ్యాపార సామ్రాజ్యాలకు మకుటం ఉన్న మహారాజు అంబానీ. అలాంటి అంబానీ ఒక విజ్ఞప్తి చేస్తే సాధారణ రాజకీయ నాయకులు దానిని పట్టించుకోకపోవడమా? సాధ్యమా? అని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ.. రాజకీయ ప్రస్థానానికి తన సొంత బలం, సొంత ప్రజాభిమానం మాత్రమే నమ్ముకున్న జగన్మోహనరెడ్డి.. వ్యాపార దిగ్గజాలు ‘డిక్టేట్’ చేసే రాజకీయ ఆబ్లిగేషన్స్ ను ఖాతరు చేసే రకం కాదు అని నిరూపించుకున్నారు.

రెండు రోజుల కిందట రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యాధినేత ముఖేష్ అంబానీ తన కొడుకు మరియు రాజ్యసభ ఎంపీ పరిమల్ నత్వానీతో కలిసి అమరావతికి వచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డితో మొదటి సారిగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో తలపెడుతున్న రిలయన్స్ ప్రాజెక్టుల గురించి, అలాగే నాడు-నేడు కార్యక్రమం గురించి జగన్ వారికి సుదీర్ఘంగా వివరించారు. ఈ నేపథ్యంలో పరిమల్ నత్వానీని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా పంపేందుకు సహకరించాల్సిందిగా అంబానీ కోరినట్లుగా వార్తలు వచ్చాయి.

ఈ విషయాని నత్వానీ స్వయంగా ధ్రువీకరించడం విశేషం. పార్లమెంటులో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. తనను ఏపీనుంచి రాజ్యసభకు పంపడం గురించి జగన్ వద్ద ప్రతిపాదించిన విషయాన్ని ఒప్పుకున్నారు.

అయితే బయటివారికి రాజ్యసభ సీటు ఇచ్చే సంప్రదాయం ఇప్పటిదాకా తమ పార్టీలో లేదని జగన్ వారితో తేల్చిచెప్పినట్లుగా స్వయంగా నత్వానీ వెల్లడించారు. అయినప్పటికీ.. తనకు మూడు రోజుల సమయం ఇవ్వాల్సిందిగా జగన్ కోరినట్లు నత్వానీ అంటున్నారు గానీ.. ఏదో ఆపద్ధర్మంగా మొహంమీదనే నో చెప్పలేక అలా సమయం అడిగినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

అంబానీ … తన రాజకీయ అవసరాల కోసం నత్వానీని వెంటబెట్టుకుని వచ్చి ఈ ప్రతిపాదన చేసి ఉండొచ్చు గానీ.. పార్టీని నమ్ముకున్న వారిని కాదని నత్వానీని ఎంపీ టికెటివ్వడం కల్ల అని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏపీ కాకపోతే ఒదిశా, బీహార్ అసోం ఇలా ఏదో ఒకచోటనుంచి ఎన్నిక కావడానికి నత్వానీ తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు.