డెత్‌ మిస్టరీ: మారుతీరావు ఎందుకు చనిపోయాడు.?

ఒక ప్రేమకు.. ఇద్దరు బలైపోయారు. కూతురిపై ప్రేమ కాస్తా కన్న తండ్రిని కసాయిగా మార్చేసింది. కుమార్తె తనకు దూరమవడానికి ఆమెను ప్రేమించిన యువకుడే కారణమనే అక్కసుతో సదరు తండ్రి, దారుణానికి ఒడిగట్టాడు. మరోపక్క, తన భర్త చావుకి కారణమైన తండ్రిని మరింత ద్వేషించింది ఆ కుమార్తె. ఇక తన కుమార్తె ఎప్పటికీ తన వద్దకు రాదనుకున్న ఆ తండ్రి, కోర్టు కేసులకే భయపడ్డాడో.. కుమార్తె మీద అమితమైన ప్రేమతో ఆవేదన చెందాడో.. ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే, ‘మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు’ అని అమృత అంటోంది. ఆస్థి గొడవలు, శిక్ష భయంతోనే మారుతీరావు ఆత్మహత్య చేసుకుని వుండొచ్చని కూడా ఆమె అభిప్రాయపడుతోంది. మరోపక్క, మారుతీరావు సోదరుడు శ్రావణ్‌ మాత్రం, మారుతీరావు మరణానికి కారణం ఆయన కుమార్తె అని చెబుతుండడం గమనార్మం.

తన సోదరుడితో తనకెలాంటి ఆస్తి వివాదాలూ లేవని శ్రావణ్‌ చెబుతుండగా, శ్రావణ్‌ (అమృతకి బాబాయ్‌) వల్ల తన తల్లికి ప్రాణాపాయం పొంచి వుందని అమృత ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. కాగా, తన తల్లి వద్దకు తాను వెళ్ళే అవకాశమే లేదనీ, ఒకవేళ ఆమె గనుక వస్తే.. ఆమె బాధ్యతను తీసుకోవడానికి తాను సిద్ధమేనని అమృత చెబుతుండడం ఆసక్తికరమైన విషయమిక్కడ. ఆస్తి మీద మాత్రం తనకు ఏమాత్రం మమకారం లేదని అమృత తేల్చి చెప్పేస్తోంది.

‘భర్తను కోల్పోయిన బాధను ఏడాదిన్నరగా నేను అనుభవిస్తున్నాను.. కాబట్టి, మా అమ్మ పడుతున్న బాధను అర్థం చేసుకోగలను..’ అని అమృత అంటోంది. సినిమా కథల్ని మించిన స్థాయి ద్రిల్లర్‌లా సాగుతోంది.. ఈ నిజ జీవిత గాధ. ఇదిలా వుంటే, విషం సేవించడం వల్లే మారుతీ రావు చనిపోయినట్లు ప్రాథమికంగా పోలీసులు వెల్లడిస్తున్నారు.

‘కుమార్తె ఎప్పటికీ తన వద్దకు రాదనే ఆవేదనతోనే మారుతీరావు ఆత్మహత్య చేసుకుని వుంటాడు..’ అని మారుతీ రావుతో ఏడేళ్ళుగా సన్నిహిత సంబంధాలున్న న్యాయవాది ఒకరు చెబుతున్నారు. అమృత భర్త ప్రణయ్‌ హత్యకు గురైనప్పటినుంచీ, మారుతీరావు తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడన్నది సదరు న్యాయవాది చెబుతున్న మాట.