రుణభారం ఉన్న భారతీయులందరికీ ఆర్బీఐ అతిపెద్ద శుభవార్త చెప్పింది. కరోనా నేపథ్యంలో అందరి ఉపాధి తలకిందులు కావడం వల్ల మూడు నెలల పాటు మీరు తీసుకున్న రుణాలకు ఈఎంఐలు కట్టక్కర్లేదని ఆర్బీఐ ప్రకటించింది. గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ మేరకు బహిరంగ ప్రకటన చేశారు.
ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటుచేసిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అనేక కీలక నిర్ణయాలు ప్రకటించారు. భారత వృద్ధి రేటును 5 శాతానికి కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి వృద్ధి రేటుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. అయితే, ప్రస్తుతానికి ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈఎంఐలపై అధికారికంగా ఆర్బీఐ మూడు నెలల మారటోరియం విధించింది. అంటే… మీరు మూడు నెలలు ఏ ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదు. బ్యాంకులు అడగవు. మీరు ఈఎంఐ కట్టకపోవడం వల్ల మీ సిబిల్ స్కోరు ఏ మాత్రం దెబ్బతినదు. ఆ తర్వాత కూడా ఈ మూడు నెలల సొమ్ము మీకు ఇష్టమైనపుడు కట్టుకోవచ్చు అని ఆర్బీఐ తెలిపింది.
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో రెపో రేటుతో పాటు రివర్స్ రెపో రేటును కూడా ఆర్బీఐ తగ్గించింది. ఏకంగా 90 బేసిస్ పాయింట్ల కోత విధించింది. దీంతో రివర్స్ రెపో రేటు 4 శాతానికి తగ్గింది. ఈ నిర్ణయాల వల్ల సాధ్యమైనంత వరకు ఆర్థిక స్థిరత్వం సాధించడానికి వీలుపడుతుందని గవర్నర్ పేర్కొన్నారు.
ఆర్బీఐ ఇచ్చిన రిలీఫ్ వ్యాపారులకు, ఉద్యోగులకు వరంగా మారింది. కరోనా వల్ల అనేక కొత్త ఖర్చులు రావడంతో పాటు వేతనాలపై, ఆదాయాలపై ప్రభావం చూపింది. దీంతో ఈఎంఐలు తలకుమించిన భారంగా మారితే ప్రతిఒక్కరు డిఫాల్టర్ అవుతారని భావించిన ఆర్బీఐ ఈ తాజా నిర్ణయం తీసుకుంది.