టాలీవుడ్ ‘కదులుతోంది’

ఎన్నో గడ్డు పరిస్థితులను చూసి ఆరితేరిన, గట్టిపడిన ఇండస్ట్రీ ‘టాలీవుడ్’. నాటకాల నుంచి ప్రేరితమై చలనచిత్రంగా రూపుదిద్దుకున్న సినిమా ను పరిశ్రమగా మార్చిన ఘనత లో వాటా మన తెలుగువాళ్లకూ వుంది. మదరాసు పట్టణంలో చిత్ర పరిశ్రమ బలంగా వేళ్లూనుకోవడంలో తెలుగువారి కృషి చాలా వుంది. మదరాసు నుంచి హైదరాబాద్ కు తరలి వచ్చి, టాలీవుడ్ గా రూపాంతరం చెందిన తరువాత అనేక ఒడి దుడుకులు ఎదుర్కొంటూ వచ్చింది.

అడ్డంకులు వచ్చిన ప్రతిసారీ ఎదురీది, ఎదిగి, మరింత గట్టిపడింది. టీవీలు వచ్చినపుడు ఇక సినిమాలు అంతే అనుకున్నారు. టీవీలో పబ్లిసిటీ చేయనిదే సినిమా లేదు. సినిమా లేనిదే టీవీ లేదు అనే పరిస్థితికి వచ్చి, సినిమా గెలిచి నిలిచింది. యూ ట్యూబ్ యుగంలో సినిమాకు గడ్డుకాలమే అనుకుంటే, ఆ ప్లాట్ ఫారమ్ కు కూడా కంటెంట్ అందించేది సినిమానే అని మరోసారి ప్రూవ్ చేసింది. ఆ తరువాత ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ లు ప్రారంభమయ్యాయి. వాటికి కూడా కంటెంట్ ఇవ్వాల్సింది టాలీవుడ్ నే అని మరోసారి రుజువయింది.

ఇలా ప్రతి సారీ ఏదో ఒక వైపు నుంచి పోటీ ఎదురు అవుతున్నా కూడా, టాలీవుడ్ గెలిచి నిలుస్తోంది. అయితే టాలీవుడ్ గెలిచి, నిలుస్తున్నా కూడా మరోపక్క వేరే విదంగా మార్పు తప్పడం లేదు. ఎంతో కొంత ఓటమి తప్పడం లేదు. యూ ట్యూబ్, ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్స్ ను టాలీవుడ్ తట్టుకున్నా, సినిమాలకు ఫౌండేషన్ లాంటి థియేటర్ల వ్యవస్థ మాత్రం తట్టుకోలేకపోతోంది. ప్రతి సారీ ఎంతో కొంత నష్టపోతూనే వుంది.

రియల్ ఎస్టేట్ ఊపందుకున్న తరువాత థియేటర్ల వ్యవస్థ మీద తొలి దెబ్బ పడింది. చాలా థియేటర్లు ఫంక్షన్ హాల్స్ గా మారాయి. వర్కవుట్ కాక చాలా మంది షాపింగ్ కాంప్లెక్స్ లుగా, అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లుగా మార్చేసారు. ఆ విధంగా థియేటర్లు తగ్గడం ప్రారంభమైంది. ఇలాంటి టైమ్ లో మల్టీ ఫ్లెక్స్ లు వచ్చాయి. ఇలా మోడరన్ గా వుంటే థియేటర్లకు జనం వస్తారు అని ఫిక్స్ అయ్యారు. మళ్లీ సింగిల్ థియేటర్లు అన్నీ కొత్తగా కళకళలాడడం ప్రారంభమైంది.

పెద్ద పెద్ద వాళ్లు అంతా థియేటర్ల వ్యాపారంలోకి దిగాక, పాత థియేటర్లు అన్నీ కొత్త పెళ్లి కూతుళ్ల మాదిరిగా ముస్తాబు అయ్యాయి. అటు మల్టీ ఫ్లెక్స్ లు, ఇటు కొత్తగా మారిన సింగిల థియెటర్లు కలిసి, ఆదాయం పెంచి, సినిమా పరిశ్రమను కళకళలాడించాయి. జనం ఎంత టికెట్ పెట్టినా సినిమాకు వస్తున్నారు. మొన్నటికి మొన్న జనవరిలో వందల కోట్ల ఆదాయం థియేటర్ల మీదుగా సినిమారంగంలోకి వచ్చింది.

కరోనా దెబ్బ

ఇలా ప్రతి సారీ ఏదో రూపంలో వస్తున్న దెబ్బను టాలీవుడ్ తట్టుకుంటూ వస్తోంది. కానీ ఈసారి బలమైన దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఈ దెబ్బకు టాలీవుడ్ పునాదులు కదులుతాయేమో అన్న భయం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్ని పోటీలు వచ్చినా, టాలీవుడ్ స్థంభించిపోలేదు. నడుస్తూనే వుంది. నడుస్తూనే ఎదుర్కొంటూ వుంది. కానీ ఇప్పుడు చలన చిత్ర పరిశ్రమ కదలిక ఆగింది. బహుశా టాలీవుడ్ పుట్టిన తరువాత ఇదే తొలిసారేమో ఇలాంటి పరిస్థితి రావడం.

సినిమా పరిశ్రమ పునాదులైన థియేటర్ల దగ్గర నుంచి హీరో ల వరకు కరోనా కల్లోలం వల్ల ఇబ్బంది పడని వారు లేరు. ఇక్కడ డబ్బులు వున్నాయా? లేవా? అన్నది కాదు పాయింట్. పని వుందా లేదా అన్నది క్వశ్చను. అదే సమయంలో సినిమా పరిశ్రమ మీద ఆధారపడి బతుకున్నవారిలో కనీసం యాభై శాతం మంది అయినా డబ్బు సమస్య కూడా ఎదుర్కోంటున్నారనే చెప్పాలి.

థియేటర్ల గోడు

టాలీవుడ్ లో ఇప్పుడు అతి పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నది థియేటర్ల యజమానులే. చాలా వరకు థియేటర్లు లీజులో వున్నాయి. సురేష్ బాబు, అల్లు అరవింద్, ఆసియన్ సునీల్, దిల్ రాజు, యువి వంశీ లాంటి ప్లేయర్లు వున్నారు. వీరంతా గ్రౌండ్ లీజులు తీసుకున్నవే ఎక్కువ. అలాంటపుడు సిబ్బంది జీతాలు అన్నీవీరే చూసుకుంటారు. ఇక్కడే వస్తోంది సమస్య. వీరంతా హైదరాబాద్ లో వున్నారు. కిందన మేనేజర్లు వుంటారు. వీళ్లకు వుండే అధికారాలు పరిమితం. సిబ్బందికి పూర్తి కాలం జీతాలు ఇవ్వకుంటే పరిస్థితి దారుణంగా వుంటుంది. ఇస్తారో ఇవ్వరో క్లారిటీ లేదు. పూర్తి కాలం జీతాలు వేరు బేటాలు/బత్తాలు వేరు. థియేటర్ పని చేయని కాలంలో బత్తాలు ఇస్తారో ఇవ్వరో అన్న అనుమానం.

ఇదే యజమాని స్వంతంగా థియేటర్ నడుపుకుంటే వర్కర్స్ తో ఒక అనుబంధం వుంటుంది. వారి మంచి చెడ్డలు తెలుసుకుని, చూసుకుంటారు. ఇప్పుడు ఆంధ్ర అంతటా ముఖ్యంగా ఈస్ట్, వెస్ఠ్, ఉత్తరాంధ్రలో థియేటర్ల వర్కర్లు దాదాపు పస్తులు వుండే పరిస్థితి వుంది. ఈ విషయంలో థియేటర్లు లీజుకు తీసుకున్న బడాబాబులు కానీ ఎగ్జిబిటర్ల సంఘాలు కానీ ముందుకు వచ్చి ఏం చేస్తాయన్నది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ అన్నది థియేటర్ల మీద కనీసం మరో నెల నుంచి రెండు నెలలు వుంటుందని అంచనా.

నిర్మాణాలు-రిలీజులు

మరోపక్కన టాలీవుడ్ 2020 సమ్మర్ ను కోల్పోతోంది. ఏప్రియల్ 15 వరకు థియేటర్లు బంద్. ఇది ప్రస్తుతానికి వున్న ఆదేశాలు. ఆ తరువాత ఎలా వుంటుందో తెలియదు. ఓవర్ సీస్ లో అయితే కనీసం మరో రెండు నెలల వరకు థియేటర్లు తెరవరు అని టాక్. ఇలాంటి నేపథ్యంలో ఈ సమ్మర్ విడుదల టార్గెట్ గా తయరయిన, తయారవుతున్న సినిమాలు అన్నీ అలా వుండిపోయాయి.

ఏప్రియల్ లో దాదాపు చిన్న, పెద్ద కలిపి పది సినిమాల వరకు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు అవన్నీ ఆగిపోయాయి. ఇవి కాక, సమ్మర్ విడుదల కోసం రెడీ అవుతున్నాయి మరో పది సినిమాల వరకు. అవన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. దాదాపు అన్నీ కలిసి మూడు నుంచి అయిదు వందల కోట్ల వరకు టర్నోవర్ ను ఆపేసినట్లే.

మళ్లీ పరిస్థితి నార్మల్ కు వచ్చి, డేట్ లు అన్నీ సర్దుబాటు చేసుకుని, సెట్ మీదకు వెళ్లేసరికి,. అలాగే థియేటర్లలోకి వచ్చేసరికి ఎంత కాలం పడుతుందో, పరిస్థితి ఎలా వుంటుందో తెలియదు.

ఎకానమీ ప్రభావం

టాలీవుడ్ లో పెట్టుబడులు అన్నీ రకరకాల మార్గాల నుంచి వస్తాయి. రాజకీయ నాయకుల బ్లాక్ మనీ, కాంట్రాక్టర్లు, బడా బాబుల బ్లాక్ మనీ అప్పుల రూపంలో సినిమా రంగంలోకి వస్తుందనే టాక్ వుంది. ఇప్పుడు ఆర్థికంగా ప్రపంచం అతలాకుతలం అయిపోతోంది. అయిపోతుంది. దాంతో టాలీవుడ్ కు ఫండ్స్ సమస్య తప్పదు. అదే సమయంలో ఫైనాన్సియర్లు కరుణిస్తే సరి లేదంటే, వడ్డీలు తడిసి మోపెడు అవుతుంది.

నిర్మాతల సమస్య ఇలా వుంటే, సినిమా రంగంలోని కార్మిక వర్గం మరీ తీవ్రమైన సమస్య ఎదుర్కోబోతోంది. హీరోలు, దర్శకులు, పెద్ద టెక్నీషియన్ లను పక్కన పెడితే, మిగిలిన వారంతా ఏదో విధంగా రోజువారీ కార్మికుల కిందే లెక్క. షూటింగ్ లు వుంటేనే పైసలు వస్తాయి. కాల్ షీట్ కు లక్షలు అయితేనేం, వేలు అయితేనేం షూటింగ్ వుంటేనే వచ్చేది.

ఇక లైట్ బాయ్ లు, మేకప్ మ్యాన్ లు, ప్రొడక్షన్ బాయ్ లు, కెమేరా అసిస్టెంట్ లు ఇలా ఒకరేమిటి వేలాది మంది రోజువారీ జీతాల మీద పడి బతకాల్సిందే. ఇక చిన్న చిన్న చితక జూనియర్ ఆర్టిస్ట్ ల సంగతి చెప్పనక్కరలేదు. పైగా టీవీ సీరియళ్లు, లైవ్ షో లు కూడా ఆగిపోయాయి. జబర్దస్త్, అదిరింది, ఇలా అనేక షో లకు హాజరై గ్యాలరీల్లో కూర్చుని పకపకా నవ్వుతూ, తప్పట్లు కొడుతూ కనిపించే అనేకానేక మంది యువతరానికి రోజువారీ భత్యం లేకుండా పోయింది. సినిమా షూటింగ్ లు వుంటే కనీసం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం గడచిపోయేది ఇప్పుడు అది కాస్తా లేకుండా పోయింది.

పెద్దల మెహర్బానీ

ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ పెద్దలు మెహర్బానీ ప్రారంభమైంది. టాలీవుడ్ పెద్దలు అనేక మంది కేంద్రానికి, రాష్ట్రాలకు విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. నిజానికి ప్రభుత్వానికి విరాళాలు అందివ్వడం తప్పు కాదు. కానీ ప్రభుత్వాలు అవి చేయాల్సిన పని అవి చేస్తాయి. ఇక్కడ టాలీవుడ్ పరిస్థితి గమనించాలి. ఇక్కడ కార్మికులను ఆదుకోవాలి. 24 క్రాఫ్ట్స్ సంఘాల ద్వారా ఆయా కార్మికులకు చేయూతనివ్వాలి. అలా చేయకుండా కేంద్రానికి, రాష్ట్రానికి కోట్లు కుమ్మరించడం అంటే కేవలం మెహర్బానీ కోసం అనుకోవాల్సి వస్తుంది.

ఇలాంటి టైమ్ లో కొంతమంది దళారులు కూడా రెడీ అయిపోతారు. తమ సేవా సంఘాల ద్వారా కార్మికులకు సాయం అందిస్తామంటూ, తమకు పెద్దలతో వున్న ర్యాపో ను వాడేసుకుని, డబ్బులు దండేసుకునే వ్యవహారం వుండనే వుంటుంది. లక్షలు చేతిలో పడితే, వేలు విదిలించి, డబ్బు చేసుకుంటారనే ఆరోపణలు వుండనే వున్నాయి.

టాలీవుడ్ పెద్దలకు కూడా అదే కావాలి. వారంతట వారు సాయం చేసేంత తీరుబాబు, ఓపిక వుండవు. ఇచ్చాం అనిపించేసుకుంటే చాలు.

పెద్ద కుటుంబాలు కదల్లేదు

టాలీవుడ్ కు మూలస్థంభం లాంటి కుటుంబాలు కొన్ని వున్నాయి. అక్కినేని, నందమూరి, దగ్గుబాటి లాంటివి. అక్కినేని కుటుంబంలో ముగ్గురు హీరోలు వున్నారు, ఓ హీరోయిన్ వుండనే వుంది. స్టూడియో, నిర్మాణాలు వుండనే వున్నాయి. ఈ వ్యాసం రాసే సమయానికి పైసా విరాళం ఊడి పడలేదు.

ఇక దగ్గుబాటి కుటుంబం. స్టూడియో, నిర్మాణాలు, వందలాది థియేటర్ల లీజు, ఇద్దరు హీరోలు ఇలా చాలా వుంది వ్యవహారం. అక్కడి నుంచి కూడా రూపాయి బయటకు రాలేదు.

ఇక నందమూరి కుటుంబం. జూనియర్ ఎన్టీఆర్ ముందుకువచ్చారు కానీ, బాలకృష్ణ కనీసం ఓ ఊరడింపు ప్రకటన కూడా చేయలేదు. పైగా ఆయన శాసనసభ్యుడు కూడా. పైగా విరాళాలతో, ప్రభుత్వ స్థలాలతో నిర్మించి, తెల్లకార్డుల వారిని వదిలేసి, మిగిలిన వారి దగ్గర దాదాపుగా ప్రయివేటు సంస్థల మాదిరిగా ఆసుపత్రులు నడుపుతున్నారనే కామెంట్ లు వుండనే వున్నాయి. అక్కడి నుంచి కూడా పైసా ఊడిపడలేదు.

ఇక సినిమా పెద్దలు అని చెప్పుకునే అశ్వనీదత్, కే రాఘవేంద్రరావు లాంటి వారి నుంచి ఓ ప్రకటన కూడా లేదు. వీరంతా మళ్లీ టాలీవుడ్ పెద్దలు. ఇక ప్రపంచం గర్వించదగ్గ తెలుగు దర్శకుడు రాజమౌళి. ఆయన ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా టాలీవుడ్ మీదే వున్నారు. వారి నుంచి కూడా రూపాయి రాలలేదు.

ఎగ్జిబిటర్ గా, నిర్మాతగా, ఆహా అనే ఆన్ లైన్ ఫ్లాట్ ఫారమ్ భాగస్వామిగా, ఇండస్ట్రీ కింగ్ పిన్స్ లో ఒకరిగా వున్న అల్లుఅరవింద్ నుంచి రూపాయి విరాళం అన్న మాట కూడా వినిపించలేదు.

ఇండస్ట్రీలో లెజెండ్ అనిపించుకునే మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వుంది. అనేక విద్యాసంస్థలు వున్నాయి. ఇంట్లో అందరూ నటులే. అయినా అక్కడి నుంచి కూడా విరాళం పలకలేదు

ఇప్పట్లో ఆగకుంటే..

కరోనా ప్రభావం ఏప్రియల్ తో ముగిసిపోతే ఫరావాలేదు. టాలీవుడ్ మరోసారి మరో ఉపద్రవాన్ని తట్టుకుని నిల్చుంటుంది. అలా కాకుండా వినిపిస్తున్న రకరకాల గ్యాసిప్ ల ప్రకారం జూన్ వరకు కనుక కరోనా హడావుడి వుంటే మాత్రం, టాలీవుడ్ తట్టుకోవడం కష్టం. నిర్మాతలు, హీరోలు, దర్శకులు తట్టుకున్నా, టాలీవుడ్ ను నమ్ముకున్నమిగిలిన వారు మాత్రం కుదేలైపోతారు. వారినే కావచ్చు, థియేటర్ల జనాలనే కావచ్చు, ఆదుకోవడానికి ఇప్పటి నుంచి ప్రణాళికలు రూపంపొందించాలి. అలా కాకపోతే మాత్రం టాలీవుడ్ కదిలిపోతుంది.