మే నాటికి భారత్ లో 13లక్షల మందికి కరోనా?

చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా మహమ్మారి…దాదాపుగా ప్రపంచ దేశాలన్నింటినీ గజగజలాడిస్తోంది. భారత్ లోనూ క్రమేణా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీలోని మర్కస్ మస్జిద్ లో జరిగిన సదస్సుకు హాజరైన వారిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కలవరపెడుతోంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు పలు సంస్థలు చెబుతున్న ఫార్ములాలు రెండే. ఒకటి హోమ్ క్వారంటైన్, రెండు టెస్ట్..టెస్ట్…టెస్ట్.

కఠినంగా ఉన్నప్పటికీ…హడావిడిగా విధించినప్పటికీ ….లాక్ డౌన్ వల్ల మన దేశంలో హోమ్ క్వారంటైన్ చాలా వరకు అమలవుతూనే ఉంది. కానీ, 130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో వైద్య సదుపాయాలు…ప్రత్యేకించి కరోనా మహమ్మారి సోకిందో లేదో తెలుసుకునేందుకు అవసరమైనన్ని కిట్లు లేవన్నది కలవరపెట్టే అంశం.

గురువారం నాటికి దేశవ్యాప్తంగా 50 వేల మందికి మాత్రమే కరోనా టెస్టులు చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ కేసులు కాకుండా కూడా దేశంలో కరోనా కేసులు వేల సంఖ్యలో ఉండవచ్చని ప్రముఖ మీడియా సంస్థ `ది గార్డియన్` సంచలన కథనం ప్రచురించింది. మిగతా దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా నెమ్మదిగా విస్తరిస్తున్నట్టుగా తాజా గణాంకాలు చెబుతున్నాయి.

గురువారం మధ్యాహ్నం నాటికి భారత్ లో 1965 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 50 మంది మృత్యువాతపడ్డారు. అయితే, గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉండి ఉండవచ్చని, ‘ది గార్డియన్’ చెబుతోంది. కరోనా అనుమానితులకు రక్త పరీక్షలు నిర్వహించే సామర్థ్యం భారత్ లో తక్కువగా ఉందని, 130 కోట్ల జనాభా ఉన్న భారత్ లో వైద్య సేవలు చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయని చెబుతోంది. కరోనా లక్షణాలున్నా పరీక్షలు చేసేందుకు తగిన కిట్లు లేవని చెప్పింది.

ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో కేసులు పెరగడంతో పాటు దాదాపు 10 లక్షల మంది కన్నా ఎక్కువ మంది నివసించే ముంబైలోని ధారావీ మురికివాడకూ వైరస్ వ్యాపించడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. 130 కోట్ల ప్రజలున్న మన దేశ జీడీపీలో ప్రజా వైద్యంపై ఖర్చు పెడుతున్నది కేవలం 1.3 శాతమేనని, ఇది ప్రపంచ దేశాల సగటు కన్నా తక్కువని చెప్పింది. భారత్ లో తొలికేసు నమోదై రెండు నెలలు కావచ్చిందని, ఇప్పటివరకు 50 వేల మందికి మాత్రమే రక్తపరీక్షలు జరగడం శోచనీయమని చెప్పింది.

భారత్ లో కరోనా పరీక్షలు చేయడానికి 52 ప్రభుత్వ ల్యాబ్ లకు మాత్రమే అనుమతి ఉందని…130 కోట్ల జనాభా ఉన్న భారత్ లో ఆ ల్యాబ్ ల సంఖ్య సరిపోదని `ది గార్డియన్` అభిప్రాయపడింది. మే రెండో వారం నాటికి భారత్ లో 13 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది.

పుణెలోని మై ల్యాబ్ సంస్థకు కరోనా టెస్ట్ కిట్ లు తయారు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని, ఆ ఒక్క సంస్థ తయారు చేసే కిట్లు దేశమంతా పంపిణీ చేయడం వల్ల సమయంలో జాప్యం జరుగుతోందని అభిప్రాయపడింది. ఇక, భారత్ లో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులకు సరైన రక్షణ సూట్ లు, మాస్కులు, నెగెటివ్ ప్రెషర్ వార్డులు అందుబాటులో లేవని చెప్పింది. తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు కరోనా బాధితులకు చికిత్స చేస్తున్నారని చెప్పింది.

తన కళ్ల ముందే వందల మంది కరోనా అనుమానితులు క్యూలో నిలబడుతున్నారని, వారి వంతు వచ్చే సరికి ఒకటి రెండు రోజుల సమయం పడుతోందని కోల్ కతాకు చెందిన ఓ యువ వైద్యుడు ఆవేదన చెందినట్లు కథనంలో ప్రచురించింది. ఆ సమయంలో ఆ క్యూలో నిలబడ్డ వారిలో కొందరు పాజిటివ్ ఉన్నా కూడా…మిగతా వారికి వారి వల్ల వైరస్ సోకే ప్రమాదం ఉందని…కానీ, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని ఆ వైద్యుడు వాపోయినట్లు గార్డియన్ తెలిపింది.

ఇక, సోషల్ మీడియాలో, ముఖ్యంగా ట్విట్టర్ లో ‘కరోనా జీహాద్’ ట్రెండ్ అవుతోందని, ఢిల్లీ ఉదంతాన్ని బేస్ చేసుకొని దేశంలో కరోనా వ్యాప్తికి ముస్లింలే కారణమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయని తెలిపింది. దీంతో, ఇప్పుడిప్పుడే ఢిల్లీ అల్లర్ల నుంచి కోలుకుంటోన్న భారత ప్రజల మధ్య విద్వేషాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ‘ది గార్డియన్’ హెచ్చరించింది.