బాలీవుడ్ లో రీమిక్స్ ఫీవర్ కొనసాగుతూ ఉంది. పాత పాటల నుంచి మొదలుపెట్టి.. పది పన్నెండేళ్ల కిందటి పాటలను కూడా రీమిక్స్ చేస్తున్నారక్కడ. సూపర్ హిట్ అయిన సాంగ్స్ ను రీమిక్స్ చేయడం ద్వారా తమ సినిమాలను ఉనికిలో నిలుపుకోవడానికి అక్కడి మూవీ మేకర్లు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. రీమేక్ లు, పాత సినిమాల టైటిళ్లను వాడటం, లేదంటే సీక్వెల్స్ అనడం, రీమిక్స్ సాంగ్స్.. ఇవే బాలీవుడ్ మెటీరియల్స్ అయ్యాయిప్పుడు. ఈ క్రమంలో ఏఆర్ రెహమాన్ సాంగ్ ఒక దాన్ని వేరే వాళ్లు రీమిక్స్ చేశారు. ఇది ఆ సంగీత దర్శకుడికి అసహనాన్ని కలిగించినట్టుగా ఉంది.
ఢిల్లీ 6 అని దాదాపు పది, పన్నెండేళ్ల కిందట ఒక సినిమా వచ్చింది. అందులో ఒక పాట కల్ట్ హిట్ అయ్యింది. అదే ‘మసాకలీ..’ ఆ హిందీ సినిమాలోని పాటలు అప్పట్లో సౌతిండియాలో కూడా బాగా వినిపించాయి. పదేళ్లు అయినా అలా గడిచాయో అంతలోనే ఆ సినిమాలోని ‘మసాకలీ’ పాటను రీమిక్స్ చేశారు. దానికి రెహమాన్ పర్మిషన్ ఏ మాత్రం ఉందో కానీ, ఈ విషయంపై స్పందించాడు ఆ సంగీత దర్శకుడు. ఎంజాయ్ ది ఒరిజినల్ అంటూ రెహమాన్ ఒక పోస్టు పెట్టాడు. తద్వారా రీమిక్స్ ను నిరసించాడు.
ఈ మధ్యనే రెహమాన్ పాటలు కొన్ని రీమిక్స్ అయ్యాయి బాలీవుడ్ లో. బొంబైలో బాగా హిట్టైన ‘అరబిక్ కడలందం’ పాటను.. హిందీలో ఓకే జానూలో రీమిక్స్ చేశారు. ఆ పాటకు వ్యూస్ అయితే వచ్చాయి కానీ, ఆ సినిమా హిందీలో ఆడలేదు. అప్పుడు కూడా రెహమాన్ రీమిక్స్ లు తనకు నచ్చవంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు.